జనసేన అధినేత పవన్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబునాయుడు మొట్టమొదటిసారిగా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఇన్నాళ్లు పవన్‌ను పెద్దగా విమర్శించన బాబు ఇప్పుడు నిప్పులు చెరిగారు. ప్రత్యేకహోదాపై కేంద్రాన్ని విమర్శించకుండా నన్ను విమర్శించడమేంటని ప్రశ్నించారు.
పవనే కేంద్రంతో లాలూచి పడి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కేంద్రాన్ని నిలదీయకుండా… మధ్యవర్తులుగా ఉండటానికి వీరెవరు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక విక్రయాలకు సంబంధించి ఒకటి, రెండు చిన్నచిన్న పొరపాట్లు జరిగితే… మైనింగ్ స్కామ్ అంటూ గాలి జనార్దన్ రెడ్డితో ముడిపెట్టారని చంద్రబాబు అన్నారు.
ఎర్రచందనంపై తాను ఉక్కుపాదం మోపానని… దీనికి సంబంధించి తమిళనాడులో తనపట్ల వ్యతిరేకత కూడా వ్యక్తమయిందని… అప్పటి ముఖ్యమంత్రి జయలలిత కూడా తనకు ఓ లేఖ రాశారని చెప్పారు. ఇలాంటి వాస్తవాలను పవన్ కల్యాణ్ తెలుసుకోవాలని సూచించారు. ప్రధాని మోదీతో మాట్లాడకుండా, తన గురించి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఎలా వేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించి… కేంద్రానికి మేలు చేయాలని చూస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.