నేటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల19 వరకూ జరగనున్నాయి. కానీ వీటికి ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. వైఎస్ఆర్ సీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి టీడీపీలో చేరిన 22మంది ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేస్తేనే సభకు హాజరవుతామని తేల్చి చెప్పారు. కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, పైగా వారిలో నలుగురుకి మంత్రి పదవులు ఇవ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు. తాము సభకు హాజరు కాకపోవడానికి అదే కారణమని తెలియజేస్తూ చంద్రబాబుకి 4 పేజీల లేఖ రాశారు. అసెంబ్లీని ఓ చట్టసభలా నడపడం లేదని, టీడీపీ ఆఫీసులా మార్చేశారని తీవ్ర విమర్శలు చేశారు. అందుకే తాము సభకు హాజరు కావడం లేదన్నారు. ప్రతిపక్షం సభకు హాజరుకావాలంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తక్షణం వేటు వేయాలని డిమాండ్ చేశారు.
అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యేల లేఖపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అంతే ధీటుగా స్పందించారు. అసలు ఎమ్మెల్యేలుగా ఉంటూ సభకు హాజరుకాని వారు జీతాలు ఎలా తీసుకుంటారని నిలదీశారు. ఒక్కో ఎమ్మెల్యే నెలకు లక్షా పాతిక వేల జీతంతో పాటు ఇతర అలవెన్సులు అన్నీ ప్రజాధనం నుంచే కదా తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో జీతభత్యాలు తీసుకుంటూ, ప్రజాసమస్యలపై చర్చించడానికి సభకు హాజరు కాకపోవడాన్ని ఏమనుకోవాలని మండిపడ్డారు. బాధ్యత లేని ప్రతిపక్షం అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రజాసమస్యలపై పోరాడలేని పార్టీ సభ నుంచి పారిపోయిందని ఎద్దేవా చేశారు. సభకు హాజరుకాలేని వారు, బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న వారు జీతాలు తీసుకోవడం మాత్రం మరిచిపోలేదని విమర్శించారు. ప్రజారాజధాని నిర్మాణానికి సహకరించాల్సింది పోయి, బురద జల్లుతున్నారని, పెట్టుబడులు రాకుండా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం నిధులు ఇవ్వకుండా పీడీ అకౌంట్లు, అవకతవకలు అని అబద్ధాలు చెబుతుంటే, ప్రతిపక్షం వారితో వంత పాడుతూ ఏపీకి తీరని నష్టం చేకూర్చుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఓ పార్టీ జెండా గుర్తుతో గెలిచి, వేరే పార్టీలోకి మారిన వారి గురించి మాత్రం పదే పదే మాట్లాడుతు దాన్నే కారణంగా చూపుతూ సభకు హాజరుకాకపోవడం, కానీ జీతభత్యాలు కచ్చితంగా తీసుకోవడం వైఎస్ఆర్ సీపీకే నష్టం కలిగించే అంశం. ఆయా నియోజకవర్గాల వారిగా ఫిరాయింపు నేతలపై వారికి ఓట్లు వేసిన వారే సమాధానం చెబుతారు. ప్రతిపక్షంగా 175 నియోజకవర్గాల్లోని ప్రజాసమస్యలపై పోరాడాల్సింది పోయి, 22 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ మొత్తానికే సభకు డుమ్మా కొట్టడం ఏంటో అర్ధం కాని స్ట్రాటజీ. పోనీ అలా అని జీతభత్యాలు తీసుకోవడం మానేశారా ? అంటే అదీ లేదు. మరి దీనిపై ప్రశ్నించిన చంద్రబాబుకు వైఎస్ఆర్ సీపీ ఏం సమాధానం చెబుతుందో ?