ఏపీలో టీడీపీ, భాజాపాల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడుతోంది. తిరుమళలకు వచ్చిన భాజాపా ఛీఫ్ అమీత్‌షాపై దాడి ఘటనతో రెండు పార్టీల మధ్య వైరం తారాస్థాయికి చేరింది. ఈ ఘటనపై తాజాగా భాజాపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు బాబుపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బయటకు శాంతి వచనాలు పలుకుతున్నారని… కానీ అంతర్గతంగా ఆయన మనసులో ఉన్నది వేరని అన్నారు.
చంద్రబాబు చేపట్టిన ధర్మ దీక్ష సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ప్రధాని మోదీపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని… ఆ సందర్భంలో చంద్రబాబు ఎంతో ఆనందంగా నవ్వుకుంటూ ఉన్నారని మండిపడ్డారు. ఆయన నవ్వును చూస్తుంటే… ప్రస్తుతం జరుగుతున్న ప్రతి ఘటన వెనక చంద్రబాబు హస్తం ఉందనే విషయం అర్థమవుతోందని అన్నారు.
ఏపీలో బీజేపీ కార్యకర్తలపై భౌతిక దాడులు ఎక్కువయ్యాయని, ఎక్కడపడితే అక్కడ కేసులు పెడుతున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. తన ఇంటిపై కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని… తమను చూసి సోము వీర్రాజు పారిపోయాడని ఆ కార్యకర్తలు చంద్రబాబుతోనే చెప్పారని… ఇంతకంటే దారుణం ఏముంటుందని ప్రశ్నించారు.
ఎన్టీఆర్ పై చెప్పులు వేయించారని, మోదీ హైదరాబాద్ వస్తే అరెస్ట్ చేయిస్తానని చెప్పారని… చంద్రబాబు నాయకత్వం ఇలాగే ఉంటుందని సోము వీర్రాజు మండిపడ్డారు. ఏపీకి నిధులు ఇవ్వబోమని బీజేపీ ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ఏపీ అభివృద్ధికి ఎన్డీఏ కట్టుబడి ఉందన్నారు.