ఆర్థిక నేరస్తులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేషేనని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. బీజేపీతో వైయస్ఆర్‌సీపీ కలిస్తే కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు అవిశ్వాస తీర్మానం పెడతామని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. మోడీతో వైయస్ జగన్ చేతులు కలిపినట్లు వస్తున్న విమర్శలపై ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఇలాంటి విమర్శలు ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఒకవేళ మోదీతో జతకడితే… కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎందుకిస్తామని అన్నారు.
మొన్నటి వరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టీడీపీ నేతలు మంచోడు అని అన్నారని… ఇప్పుడు టీడీపీ నేతలను ప్రశ్నించేసరికి ఆయన చెడ్డ వ్యక్తి అయ్యారా? అని ప్రశ్నించారు. ఆర్థిక నేరస్తులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేషేనని… వైయస్ జగన్ కాదని అన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తన మంత్రులతో రాజీనామా చేయించిన రోజే ఎన్‌డీఏ నుంచి తప్పుకునే వారు అన్నారు.
ఇప్పుడేమో అవిశ్వాస తీర్మానమని నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో ఎక్కడ వైయస్ఆర్‌సీపీకి, వైయస్ జగన్‌కు మంచి పేరు వస్తోందోనని, వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించి చంద్రబాబు మరోమారు ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. చంద్రబాబు డ్రామాలను ఎవరు నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరన్నారు రోజా.