కాక..గడ్డం వెంకటస్వామి. తెలంగాణ రాజకీయాలపై కాస్త అవగాహన ఉన్న వారికి పరిచయం అక్కర్లేని పేరు. గుడిసెల వెంకటస్వామిగా పేద వారి గుండె చప్పుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన రాజకీయ వారసులుగా వివేక్, వినోద్ ఇద్దరు యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నారు. వివేక్ ఎంపీగా పని చేస్తే వినోద్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామక్రమంలో ఇద్దరు ఓడిపోయినా చాలా కాలం తర్వాత ఈ ఇద్దరు నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
దీంతో ఇప్పుడు ఇదే వారికి సమస్యగా మారింది. గడ్డం బ్రదర్స్ ఇద్దరిలో ఒకరికే మంత్రి పదవి దక్కే అవకాశం ఉండగా ఎవరికి వారే తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. అయితే వివేక్‌కు మంత్రి పదవి దక్కడం ఖాయమని ప్రచారం జరుగుతున్న వినోద్ కూడా ఢిల్లీ పెద్దలను కలిసి తనకే మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు.
బెల్లంపల్లి నుంచి విజయం సాధించిన వినోద్ మొదటి నుండి కాంగ్రెస్‌లోనే ఉన్నారు. అయితే వివేక్ మాత్రం పార్టీలు మారుతూ చివరికి తన సొంతగూటికి చేరి చెన్నూరు నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ పార్టీని అంటి పెట్టుకుని ఉన్న తనకే మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు వినోద్. దీంతో గడ్డం బ్రదర్స్ ఇద్దరిలో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందోనని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. ఎవరికి మంత్రి పదవి దక్కినా అది గడ్డం ఫ్యామిలీకి కమ్ బ్యాక్ అనే చెప్పుకోవాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.