టీడీపీ అధినేత చంద్రబాబును రెండు రోజుల సీఐడీ విచారణకు ఏసీబీ కోర్టు ఇవ్వడంతో ఇవాళ ఆయన్ని ప్రశ్నించనున్నారు సీఐడీ అధికారులు.రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబును విచారిస్తున్నారు. 12 మందితో కూడిన టీం పేర్లను న్యాయస్ధానానికి సమర్పించారు సీఐడీ అధికారులు.
విచారణలో భాగంగా బాబుకు ప్రతి గంటకు ఐదు నిమిషాలు, లంచ్‌టైమ్‌లో ఒక గంట విశ్రాంతి ఇవ్వనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగనుండగా బాబు నిజం చెబుతారా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. మొదటి నుండి చంద్రబాబు చెబుతున్నది ఒకటే మాట. నాకేం తెలియదు..నాకేం గుర్తులేదు. తనను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని స్వయంగా జడ్జికే బాబు చెప్పిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో సీఐడీ అధికారుల విచారణలో చంద్రబాబు నోరు విప్పుతారా ..ఏం జరిగిందో చెబుతారా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.
రెండు రోజుల పాటు అంటే దాదాపు 15 గంటలపాటు సీఐడీ అధికారులకు బాబు నుంచి సమాచారం రాబట్టేందుకు సమయం ఉంది. ఈ విచారణలో బాబుతో పాటు ఆయన తరుపు న్యాయవాదులు ఆరుగురు ఉండనుండగా బాబు విచారణకు సహకరిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక కస్టడీకి తీసుకునే ముందు, కస్టడీ ముగిసిన తర్వాత ఆయనకు తప్పనిసరిగా వైద్యపరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.