రాజకీయాల్లో వాస్తవానికి ఇది సహజమే. తమ వద్ద తగినంత బలం లేకపోయినా లేదా తాము బలవంతులమని నిరూపించుకోవడానికి పొలిటికల్ పార్టీలు వేసే ఎత్తుగడే ఇది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో ఇదే జరుగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించగా టికెట్ దక్కని నేతలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా కాంగ్రెస్ లిస్ట్ ప్రకటించాక బీజేపీ ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఎందుకంటే కాంగ్రెస్‌లోని అసంతృప్తులను అక్కున చేర్చుకుని వారిని ఎన్నికల బరిలో నిలపాలని చూస్తున్నారు కమలనాథులు.
ఇక బీజేపీ సైతం టికెట్ కావల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించగా కొన్ని నియోజకవర్గాల్లో పోటీనెలకొనగా మరికొన్ని నియోజకవర్గాలకు దరఖాస్తు చేసే వారే కరువయ్యారు. 119 నియోజకవర్గాల్లో పోటీచేయటానికి పార్టీతరపున బలమైన అభ్యర్ధులు మెజార్టీ నియోజకవర్గాల్లో లేరు.
దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ అసంతృప్త నేతలకు వల వేస్తున్నారు బీజేపీ నేతలు. అయితే తొలుత బీఆర్ఎస్ నుండి పెద్ద ఎత్తున నేతలు తమ పార్టీలో చేరుతారని బీజేపీ నేతలు భావించారు కానీ అలా జరగలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ పైనే బీజేపీ నేతలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలు నెరవేరాలంటే కాంగ్రెస్ తొలి జాబితా రావాల్సిందే. ఇప్పటికే టికెట్ల ఎంపికపై పలుమార్లు భేటీ అయింది కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ. కానీ టికెట్ల అంశం ఓ కొలిక్కిరాలేదు. ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు. దీంతో బీజేపీ నేతలు కాంగ్రెస్ లీస్ట్‌పైనే గంపెడంత ఆశతో ఉన్నారు. అసంతృప్త నేతలు పెద్ద ఎత్తున వస్తే వారికి టికెట్స్ ఇచ్చి లీస్ట్ ప్రకటించాలని భావిస్తున్నారు. మరి బీజేపీ నేతల ఆశలు ఫలిస్తాయా లేదా అని తెలియాలంటే వేచిచూడాల్సిందే.