వారం రోజుల పాటు కుటుంబ సభ్యులతో కలిసి విదేశాల్లో పర్యటిస్తున్నారు ఏపీ సీఎం జగన్. భార్య వైఎస్ భారతి, కుమార్తెలు హర్షా రెడ్డి, వర్షా రెడ్డితో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లగా ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత పర్యటన. ఇక జగన్ విదేశీ పర్యటన అనగానే టీడీపీ నేతలు విమర్శలు మొదలుపెట్టారు. దోచుకున్న డబ్బును విదేశాల్లో దాచిపెట్టేందుకు వెళ్లారని ఆరోపిస్తున్నారు.
ప్రజల సొమ్మును తన సొంతానికి వాడుకుంటారా అని టీడీపీ నేతలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ప్రజాధనం అంటే సొంత ధనం అన్నట్లుగా కామన్ అయిపోయిందని దుయ్యబడుతున్నారు. వాస్తవానికి జగన్ పై ఉన్న ప్రధాన ఆరోపణ అవినీతి సొమ్ము. దేశంలో రిచెస్ట్ సీఎం జగనే. ఆయన చుట్టు ఉన్న ఈడీ,బీసీఐ కేసులు కూడా అవినీతి,అక్రమాస్తుల కేసుపైనే.
ఈ నేపథ్యంలోనే జగన్‌పై మరోసారి అవినీతి సొమ్ము ఆరోపణలతో గట్టెక్కాలని టీడీపీ భావిస్తోంది. గతంలో జగన్ దావోస్ పర్యటనకు వెళ్లినప్పుడు ఇలాంటి ఆరోపణలు చేశారు. హవాలా సొమ్ము కోసమే జగన్ దావోస్ వెళ్లారని టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా ఆరోపించారు. అప్పటినుండి విదేశాలకు వెళ్లలేదు జగన్. తాజాగా చాలా సంవత్సరాల తర్వాత కుటుంబసభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లగా తిరిగి అదేపాట పాడుతున్నారు టీడీపీ నేతలు. ఇక వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు సైతం అక్రమాస్తులను దాచుకోవడానికే జగన్ విదేశాలకు వెళ్లారని ఆరోపించగా వైసీపీ నేతలు మాత్రం ఈ విమర్శలను అంతేస్ధాయిలో తిప్పికొడుతున్నారు.
ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఎలాంటి రీజన్స్ ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్నప్పుడు కూడా పలుమార్లు విదేశాలకు వెళ్లారు ఆయన కూడా దోచుకుంది దాచుకోవడానికే వెళ్లారా అని ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా ఎన్నికల వేళ జగన్ విదేశీ పర్యటన ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.