చంద్రబాబు ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ మరో సారి విమర్శలు ఎక్కుపెట్టారు. పోరు యాత్రలో భాగంగా శ్రీకాకులం జిల్లా పలాసాలో నిరసన కవాతు నిర్వహించారు. స్థానిక హరిశంకర్ థియేటర్ నుంచి కాశిబుగ్గ బస్టాండ్ వరకు జరిగిన ఈ కవాతు అనంతరం బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆనాడు టిడిపి, బిజెపి కూటమికి మద్దతు ఇచ్చినట్టు ఆయన చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హమీలను విస్మరించాయని ఆయన విమర్శించారు. చట్టసభల్లో కూర్చొన్న నేతలు తమ ప్రయోజనాలను కాపాడుకొంటున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. అందుకే ఇప్పుడు ప్రజలకోసమే రోడ్డు మీదకు వచ్చానన్నారు.
40 ఏళ్ళకు పైగా రాజకీయ అనుభవం ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పదే పదే చెబుతున్నారని ప్రజల కన్నీరు తుడవని అధికారం ఎందుకని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ప్రజల కన్నీళ్ళు రాకుండా చేస్తామని చెప్పారు.
2014 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే భూకబ్జాలు, రౌడీయుజం, గుండాయిజం పెరుగుతాయని ప్రచారం చేశారన్నారు. కాని టీడీపీ నేతలు ఇప్పుడు చేస్తున్న దేంటని ప్రశ్నించారు. ఎక్కడ చూసినా టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.