తెలంగాణలో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. అయినా ప్రస్తుతం రాజకీయాలు మాత్రం వేడిగా ఉన్నాయి. ఎండాకాలం ఎండల మాదిరి రాజకీయాలు రోజురోజుకు ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయాలు రసకందాయంగా మారాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ మధ్య దూషణల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ రెండో విడత బస్సు యాత్ర ప్రారంభించి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తోంది. దీంతో పాటు వీరికి పోటీగా కేటీఆర్ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం చాటున రాజకీయ విమర్శలు చేస్తున్నారు. బహిరంగ సభల్లో పాల్గొంటూ కేటీఆర్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నాడు.
ఇప్పుడు ఇంకొంచెం దూకుడు పెంచి కేటీఆర్ కాంగ్రెస్‌పై ఆరోపణల పర్వం కొనసాగిస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తాము తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. దీనికి మీరు సిద్ధమా అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సవాల్ విసిరారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గురువారం నిర్వహించిన జనహిత ప్రగతి సభలో కేటీఆర్ మాట్లాడారు. ‘‘నాకిప్పుడు 42 ఏళ్లే. ఇంకో 20 ఏళ్లు రాజకీయాల్లో ఉండే శక్తి నాకుంది. 2019లో తెలంగాణలో తెరాస పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకొంటా. మళ్లీ ఎక్కడి నుంచి పోటీ చేయను. ఉత్తమ్ అన్న ఇందుకు నువ్వు సిద్ధమా? సిద్ధంగా లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని ఒప్పుకోవాలి.. అంటూ సవాల్ విసిరారు.
దీంతో కేటీఆర్ దూకుడుగా వెళ్తున్నాడు. వనపర్తి, నాగర్‌కర్నూల్, మిర్యాలగూడ బహిరంగ సభల సక్సెస్‌తో టీఆర్ఎస్ జోష్‌గా కనిపిస్తోంది. దక్షిణ తెలంగాణలో టీఆర్ఎస్ బలం అంతగా లేదు. ప్రస్తుతం కేటీఆర్ ఆ లోటును తీర్చే పనిలో భాగంగా వరుసగా పర్యటనలు చేస్తున్నాడు.