తెలంగాణ రాష్ట్ర సమితిపై ఎమ్మెల్సీ రాములు నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అంతంచేసేందుకు కట్రపన్నుతున్నారని ఆరోపించారు. తనకు ప్రాణానికి ముప్పు ఉందని…ప్రాణ రక్షణ కోసం తాను కోర్టును ఆశ్రయించబోతున్నానని చెప్పారు. ఏడాది క్రితం నుంచే తనను టార్గెట్ చేశారని…ఏదొక కేసులో ఇరికించి ఆర్థికంగా ఇబ్బందు పెట్టేందుకు చూస్తున్నారని మండి పడ్డారు.
సామాజిక సేవకుడిగానే తనకు గవర్నర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, తమపై స్వామిగౌడ్ తీరు బాగోలేదని అసహనం వ్యక్తం చేశారు. ఎస్టీని ఐనందుకే తానపై ప్రభుత్వం కుట్ర చేస్తోందని, అక్రమ కేసులు పెట్టి వేధించాలని ప్రభుత్వం చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టా ఫిరాయింపులపై ఈనెల 18న తనకు నోటీసు వచ్చిందని.. దానికి వివరణ ఇచ్చానని… పూర్తి వివరాలు ఇవ్వడానికి నాలుగు వారాల గడువు కావాలని కోరానని రాములు నాయక్ తెలిపారు. తన విన్నపాన్ని శాసనమండలి ఛైర్మన్ తిరస్కరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో సభ్యుడిని కాదని.. గిరిజన సమస్యల గురించి వివరించడానికే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశానని ఆయన వెల్లడించారు.
టీఆర్‌ఎస్‌లో చేరిన వాళ్లకో న్యాయం, మాకో న్యాయమా అని ప్రశ్నించారు. తనకు జరిగిన అన్యాయంపై కోర్టుకి వెళ్తానని, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తానని తెలిపారు. మరోవైపు తనపై ఫిర్యాదు చేసిన బోడకంటి వెంకటేశ్వర్లు కూడా పార్టీ మారిన వ్యక్తేనని.. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు.