జనసేన తరపున పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఎవరైన “జనసేన స్క్రీనింగ్ కమిటి” కి దరఖాస్తు చేసుకోవాల్సిందే అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వారే అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. అందుకు అనుగుణంగానే పవన్‌కళ్యాణ్ కూడా కమిటీకి దరఖాస్తును అందజేయడంతో ఇతర రాజకీయ పార్టీలకు ఒక రకమైన సంకేతం ఇచ్చారు పవన్. దీనితో టికెట్ కోరుతున్న వారు అందరూ ఇప్పుడు తమ దరఖాస్తులను ఇస్తూ సీటు కోసం క్యు కడుతున్నారు.
ముఖ్యంగా గోదావరి జిల్లాల నుంచి అభ్యర్థిత్వం కోసం దరఖాస్తులు సునామీలా వస్తున్నాయి. కాని ఈ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయడానికి పవన్ ముఖ్య ఉద్దేశం మాత్రం నెరవేరడం లేదు. సీటు కోసం ఎవరైనా ఇతర పార్టీల నేతలు గాని.. సీనియర్లు గాని.. ఆర్ధికంగా బలంగా ఉన్న నేతలు గాని… దరఖాస్తు చేసుకుంటారు ఏమో అని పవన్ భావించారు.
కానీ జనసేన వైపు అసలు చూసే నేతలే దాదాపుగా కరువయ్యారు. వైఎస్ఆర్‌సీపీలోకి వలసలు వెళ్తున్నాయి గాని జనసేనలోకి మాత్రం రావడం లేదు. కాపు నేతలైనా వస్తారేమో అని చూస్తే వారిలో ఏ ఒక్కరు కూడా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది.
ఇక స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకునే వారు అందరూ పవన్ కళ్యాణ్ అభిమానులే. వాస్తవానికి జనసేనలో పవన్ మినహా ప్రజాదరణ ఉన్న నేతలు ఎవరూ లేరు. తోట చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్ పేర్లు ప్రజల్లో నాలుకల్లో నానిన దాఖలాలు లేవు. ప్రస్తుతం పార్టికి ఆర్ధికంగా బలం రావాల౦టే సీనియర్ నేతలు రావాల్సిన అవసరం ఉంది. ఇక చేసేది లేక స్క్రీనింగ్ కమిటీ నుంచి ఒకటో రెండో దరఖాస్తులను ఎంపిక చేసి మిగతావన్ని ఇప్పటివరకు అందుబాటులో వున్న సీనియర్లు, సమర్థులకు కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి.