అవినీతికి పాల్పడటంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ పోటీపడుతున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్న రాహుల్.. కొమురం భీం ఆదిలాబాద్ జిల్లా భైంసాలో జరిగిన ప్రజాగర్జన సభలో రాహుల్ గాంధీ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్ట్‌ల పేరు మార్చి, రీడిజైన్ల పేరుతో వేల కోట్లు దోచుకుంటున్నారని కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రైతులకు ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీ కల్పిస్తామని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు.
అవినీతి లేని, రైతుల ఆత్మహత్యలు లేని తెలంగాణ సాకారం కావాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రజలు కలలుగన్న నవ తెలంగాణ సాధ్యం చేస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో నవ తెలంగాణ ఆవిష్కృతం అవుతుందని చెప్పారు.కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరూ ఒకటేనని.. రైతులు, ఆదివాసీల పొట్టగొట్టే పనిచేస్తున్నారని మండిపడ్డారు. తాము తీసుకొచ్చిన భూసేకరణ, ఆదివాసీ బిల్లులను తుంగలో తొక్కేయడానికి ప్రయత్నించారని మండిపడ్డారు.
ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ అభివృద్ధిలో సాగుతుందని ప్రజలు భావిస్తే.. కేసీఆర్ మాత్రం అవినీతిని మొదలు పెట్టారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అంబేద్కర్ పేరు మీద ఉన్న ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో కాళేశ్వరంగా మార్చి.. రూ.లక్ష కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచేశారన్నారు.
ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమిని ఇస్తామని ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చారా… ఇంటింటికి మంచినీళ్లు ఇవ్వలేదన్నారు.హిందూస్థాన్ ఏరోనాటికల్స్ సంస్థ అనేక యుద్ద విమానాలను తయారు చేసిందన్నారు. ఈ కంపెనీని పక్కన పెట్టి అంబానీ కంపెనీ రాఫెల్ కు ఎందుకు కాంట్రాక్టు ఇచ్చారో చెప్పాలని ఆయన మోడీని డిమాండ్ చేశారు. రూ.548 కోట్ల విమానాన్ని రూ.1600 కోట్లకు మోడీ సర్కార్ కొనుగోలు చేసిందన్నారు.
పేద ప్రజల జేబుల్లోని డబ్బులను ధనవంతుల జేబుల్లోకి వెళ్లేలా మోడీ ప్లాన్ చేశారని చెప్పారు. గబ్బర్ సింగ్ ట్యాక్స్ పేరుతో ప్రజలను ఇబ్బందుల పాల్జేశారని చెప్పారు. తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే భూసేకరణ చట్టాన్ని తీసుకొస్తామన్నారు. గిరిజనులు, ఆదీవాసీలు సంక్షేమం కోసం పనిచేస్తామన్నారు. రైతు రుణమాఫీతో పాటు ప్రతి రైతుకు ఎకరానికి రూ. 7వేలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు