ఏంటో పవన్ కళ్యాణ్ ? జనానికి ఎటూ అర్ధం కావడం లేదు. కనీసం తన లక్ష్యమేంటో ? తన ఆలోచనలేంటో ? తనకైనా అర్ధమవుతున్నాడో లేదో ? తాను ముఖ్యమంత్రిని కావాలనుకుంటే ఎప్పుడో అయిపోయేవాడంట. ఈ మాట చెప్పేముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకుని చెప్పి ఉంటే బాగుండేది కదూ ? ముఖ్యమంత్రి అంటే తన సినిమాల్లో ముఖ్యమంత్రి అనుకున్నాడా ? ఏంటి అని జనం ప్రశ్నిస్తున్నారు. మరి అంత పోటుగాడు అయితే తన అన్న చిరంజీవిని 2009లో ఎందుకు చేసుకోలేకపోయాడని ఎద్దేవా చేస్తున్నారు. చిరంజీవికి బీభత్సమైన ఫాలోయింగ్ ఉండి, మాస్ హీరోగా నెంబర్ వన్ పొజిషన్ లో ఉండి కూడా కేవలం 18 అసెంబ్లీ స్థానాలతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. నాడు ప్రజారాజ్యం తరఫున పవన్ సార్ కూడా ఊరూవాడా తిరిగారు. ఇప్పటిలాగే అప్పుడూ ఊగిపోతూ ఉపన్యాసాలిచ్చారు. పంచలూడదీసి కొట్టండి అంటూ జనాల్ని రెచ్చగొట్టారు.
ఆ ఎన్నికల్లో తన అన్న చిరంజీవికి పాలకొల్లులో, బావ అల్లు అరవింద్ కి అనకాపల్లిలో జనం పంచెలూడదూసే కొట్టారు. తమ ఫ్యామిలీ గురించి ఎక్కువ ఊహించుకుని, వాపును చూసి బలుపు అనుకుని బరిలో దిగిన మెగా ఫ్యామిలీకి పుట్టిల్లు పాలకొల్లులోనే కంగుతినిపించారు ప్రజలు. ఆ విషయాన్ని మరిచిపోయినట్టున్నారు పవన్. మొన్నటి వరకూ పోటీ చేస్తాం. కానీ గెలుపు కోసమో, అధికారం కోసమో కాదు అంటూ చెప్పుకొచ్చిన పవన్ ఈ మధ్య మాటాడితే నేను సీఎం అవుతా అంటూ కొత్త పాట పాడుతున్నారు. ఒక్కో జనసేన కార్యకర్త 500 ఓట్లు వేయిస్తే చాలంట ఆయన ముఖ్యమంత్రి అయిపోతారంట. అంత ఈజీయా పవన్ ఓట్లు వేయించడం ? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి కావాలని దశాబ్దాలుగా ప్రయత్నిస్తూ రాజకీయాల్లో ఉన్న నాయకులకే అంత ఈజీ కావడం లేదు. అలాంటిది పవన్ కావాలనుకుంటే ఎప్పుడో అయిపోయేవాడంట ? మా ఊరి మిరియాలు తాటికాయలంత…అని వెనకటికి ఎవడో చెప్పాడంట. అలానే ఉంది పవన్ గొప్పలు కూడా. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి లాంటి వారే ఎన్నో ఆపసోపాలు, ఢక్కామెక్కీలు, తింటే కానీ సీఎంలు కాలేకపోయారు. వాళ్లే కాదు దేశంలో ఏ ముఖ్యమంత్రికి కూడా ఆ సీటు అంత ఈజీగా ఏం వచ్చేయేలేదు. నిత్యం జనంలో ఉండి, జనంలో తిరిగి, జీవితాలను రాజకీయాలకు ధారపోసేసి, రేయింబవళ్లు జనం సమస్యలపై చర్చించి, పోరాడి, ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలు, ప్రజాసమస్యలపై ఉద్యమాలు, కేసులు, జైళ్లు, బెయిళ్లు, ఎత్తుకు పైఎత్తులు, ఆర్ధిక వనరులు, కుల సమీకరణాలు, అంగబలం, అర్ధబలం, నిస్వార్ధం తో సేవ, 24 గంటలూ అందుబాటులో ఉంటూ ప్రజాసేవలో వ్యక్తిగత జీవితాలను త్యాగం చేస్తే కానీ ఆ స్థాయికి అందుకోవడం సాధ్యం కాలేదు. వైఎస్ఆర్ మరణం తర్వాత దాదాపు కాంగ్రెస్ లీడర్లు, క్యాడర్ అంతా జగన్ వెంటే నడిచింది. వైఎస్ చనిపోయిన సానుభూతి పవనాలు గట్టిగా ఆయన కుటుంబంపై వీచాయి. ఆయన పెట్టిన పథకాలు దేశంలో ఏ ముఖ్యమంత్రీ పెట్టలేదన్నది జగమెరిగిన సత్యం. వాటిపై ఇప్పటికీ జనం చర్చిస్తూనే ఉంటారు. పైగా జగన్ ను జైలులో పెట్టించారనే సానుభూతి కూడా బాగా పెరిగింది. అన్ని కలిసి వచ్చినా జగన్ ముఖ్యమంత్రి కాలేకపోయారు.
వచ్చే ఎన్నికల్లోనూ గ్యారెంటీ లేకపోవడంతో రేయింబవళ్లూ జనం మధ్య ఉంటూ చెమటోడ్చుతున్నారు. ఒక్క జగన్ అనే కాదు. మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు కూడా వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ఇప్పటి నుంచే చుక్కలు కనపడుతున్నాయి. అటు కేసీఆర్ కానీ వసుంధర రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్, మమతా బెనర్జీ, మాయావతి, స్టాలిన్, అఖిలేశ్ యాదవ్, కేజ్రీవాల్, లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్, ములాయం సింగ్ యాదవ్, యోగి ఆదిత్యానాథ్…ఇలా అనేక మంది ప్రస్తుత ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, మళ్లీ ఆ స్థానం కోసం ఆపసోపాలు పడుతున్నారు. నిత్యం జనంలో ఉంటూ ఓ తపస్సులా కష్టపడుతున్నారు. అలాంటిది 6 నెలలకోసారి జనంలోకి వచ్చి నేను…కావాలనుకుంటే ఎప్పుడో ముఖ్యమంత్రిని అయిపోయేవాడిని అంటూ పవన్ ప్రగల్భాలు పలుకుతుంటే జనం నవ్వక ఏం చేస్తారు. సొంతూరు పాలకొల్లులో అన్నని, అనకాపల్లిలో బావనే గెలిపించుకోలేకపోయావు. నువ్వూ నీ గొప్పలు పిట్టలదొరలా తయారయ్యావ్ ? ఏంటి పవన్ అని నవ్వుకుంటున్నారు.