ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌కు ఆయనే కర్త, కర్మ, క్రియ. అభ్యర్ధుల ఎంపిక దగ్గరి నుండి ఎన్నికల మేనిఫెస్టో ప్రిపరేషన్ వరకు ఆయనదే అప్పర్ హ్యాండ్. ఇంతకి ఆయన ఎవరనుకుంటున్నారా టీ కాంగ్రెస్ పొలిటికల్ ఎనలిస్ట్ సునీల్ కనుగోలు. ఆయన చేసిన మేజిక్ వల్లే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దోహదపడింది. అంతేగాదు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ వచ్చిందనే చెప్పుకోవాలి. అయితే ఈ జోష్‌ని అందుకోవడంలో కాస్త వెనకబడేపోయారు కాంగ్రెస్ నేతలు. నేతల మధ్య సయోధ్య లేకపోవడం, కనీసం ఫస్ట్ లిస్ట్‌ని కూడా ప్రకటించలేని స్థితిలో ఉంది కాంగ్రెస్. దీంతో ఏకంగా అభ్యర్ధుల ఎంపికనే వాయిదా వేసింది.
ఇక తెలంగాణ కాంగ్రెస్‌ను గట్టెక్కించే బాధ్యతను సునీల్‌కు అప్పజెప్పింది కాంగ్రెస్ అధిష్టానం. కర్ణాటకలో గెలుపు తర్వాత తెలంగాణలో పూర్తిస్ధాయిలో రంగంలోకి దిగింది సునీల్ టీం. బూత్ స్ధాయిలో ఓటర్ల నాడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు సునీల్. ప్రతీ రోజు తన టీం సభ్యుల నుండి ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటూ తెలంగాణలో కాంగ్రెస్‌ని అధికారంలోకి తెచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు సునీల్.
కొంతమంది చేరికలు, కొన్నిచోట్ల సీనియర్‌ల అభ్యంతరాల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ పూర్తయినా సునీల్ సూచనతో అభ్యర్ధుల ప్రకటనను వాయిదా వేశారని ప్రచారం జరుగుతోంది. త్వరలో సునీల్ సూచించిన అభ్యర్ధుల లీస్ట్‌లో నుండే ఒక అభ్యర్ధిని ప్రకటించనుందని సమాచారం. అందుకే క్షేత్రస్ధాయిలో ప్రజల్లో ఉన్న నేత పేరుని తీసుకుని అన్ని కోణాల్లో పరిశీలించాకే అభ్యర్ధుల జాబితాను కాంగ్రెస్ ప్రకటించనుంది. ఈ బాధ్యత అంతా సునీల్‌కే అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం.
ఇక అభ్యర్ధుల ఎంపికే కాదు ప్రజలను ఆకట్టుకునే స్లోగన్స్‌ను సిద్ధం చేస్తున్నారట సునీల్. కర్ణాటకలో ఇదే సూత్రంతో వెళ్లగా అది ఫలించింది. ఇప్పుడు అదే ఫార్ములాను తెలంగాణలో కూడా అమలు చేయాలని భావిస్తున్నారు సునీల్. కర్ణాటకలో సునీల్ టీం బీజేపీపై చేసిన 40 శాతం కమీషన్ ఒక్క మాట ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఎంతలా అంటే ఈ ఒక్కమాట బీజేపీని అధికారంలో నుండి దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి తోడ్పడింది. అదే ఫార్ములాను తెలంగాణలో ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు సునీల్. మరి సునీల్ చేస్తున్న ఈ ప్రయోగం ఏ మేరకు ఫలిస్తుందో వేచిచూడాలి..