తెలుగుదేశం పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని గత కొంతకాలంగా అసంతృప్తిలో ఉన్న విజయవాడ తెలుగుదేశం పార్టీ నేత యలమంచిలి రవి వైసీపీలో చేరడం ఖాయమైంది. చంద్రబాబు స్వయంగా పిలిపించుకుని బుజ్జగించే ప్రయత్నాలు చేసినా వినని రవి, రేపు వైకాపా అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువాను కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
తాను ఎవరినీ విమర్శించడం లేదని, తన వెంట ఉన్న కార్యకర్తల అభీష్టం మేరకే జగన్ వెంట నడవాలని నిర్ణయించుకున్నానని అన్నారు. తన రాకతో ఇప్పటికే విజయవాడలో ఉన్న ఏ పార్టీ నేతకూ ఇబ్బంది కలుగదనే భావిస్తున్నానని చెప్పారు. టీడీపీలో గౌరవం దక్కలేదు కాబట్టే పార్టీని మారుతున్నానని, 2014లో తాను సిట్టింగ్ ఎమ్మెల్యేను అయినప్పటికీ, సీటు ఇవ్వకుండా అవమానించారని, టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత తాను ఓపికగా ఇంతకాలం ఎదురు చూసి విఫలం అయ్యానని అన్నారు.
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వస్తున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర టీడీపీ శ్రేణుల్లో గుబులు పుట్టిస్తోంది. జిల్లాలో పాదయాత్ర అనంతరం టీడీపీ పునాదులు కదిలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా అంశంలో వైఎస్సార్ సీపీ వ్యూహానికి తలకిందులైన టీడీపీ నాయకులపై ఆ పార్టీ నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.