పోల్ మేనేజ్‌మెంట్ః 2019 ఎన్నికల వ్యూహం రచించిన జగన్

ప్రజా పోరాటాల విషయంలో పార్టీ పెట్టిననాటి నుంచీ జగన్‌దే పైచేయి. జగన్ కంటే ఎక్కువగా ప్రజల మధ్య ఉన్న నాయకుడు తెలుగు నాట మరొకరు లేరు. అందుకే నాయకులు అందరికంటే జగన్‌కి ప్రజాభిమానం కూడా చాలా ఎక్కువే. అయితే ప్రస్తుతం ఎన్నికల్లో గెలవాలంటే ప్రజాభిమానం ఒక్కటే సరిపోదు. 2014 ఎన్నికల సమయంలో ఈ విషయంలో ఫెయిలయ్యే దెబ్బతిన్నాడు జగన్. ప్రజల్లో ఎంతగా అభిమానం ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ఆ అభిమానాన్ని ఓట్లుగా మార్చుకోవడంపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. అయితే జగన్ మాత్రం అలాంటి వ్యూహాల కంటే ప్రజాభిమానాన్నే నమ్ముకున్నాడు. చంద్రబాబు పోల్ మేనేజ్‌మెంట్ వ్యూహాల ముందు దెబ్బతిన్నాడు. కొత్త పార్టీ కావడం కూడా జగన్‌కి మైనస్ అయింది.

అయితే 2019 ఎన్నికల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్క తప్పూ జరగకూడదని జగన్ పట్టుదలగా ఉన్నాడు. ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయి సర్వేలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కూడా 2019 ఎన్నికల్లో వైకాపా గెలుపు ఖాయం అని, జగనే ముఖ్యమంత్రి అవుతాడని తేల్చిచెప్పాయి. చంద్రబాబుకంటే జగన్‌కి ఐదు శాతం ఓట్ల కంటే ఎక్కువ మార్జిన్ ఉంది అని ఆ సంస్థలు చెప్పాయి. అందుకే 2019 ఎన్నికల్లో పోల్ మేనేజ్‌మెంట్ వ్యూహాల విషయంలో కూడా ఫెయిల్ అవ్వకూడదని జగన్ ఇప్పటి నుంచే పోలింగ్ బూత్ కన్వీనర్ల కోసం ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసింది. ఈ నెల 26 నుంచీ మే నెల పది వరకూ ఆ సమావేశాలు జరగనున్నాయి. ఎంపిలు, ఎమ్మెల్యేల నుంచి నాయకులు అందరూ బూత్ స్థాయి కన్వీనర్లతో తరచుగా సమావేశం అయ్యేలా…….బూత్ స్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేలా వ్యూహం రచించాడు జగన్. అన్నింటికీ మించి ఎన్నికల సమయంలో చంద్రబాబు వ్యూహాలను ధీటుగా ఎదుర్కునేలా బూత్ స్థాయి కన్వీనర్లకు ప్రత్యేకంగా ట్రైనింగ్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నారు. జగన్ తీసుకుంటున్న ఈ చర్యలు, వ్యూహాలు మాత్రం వైకాపా శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నాయి. నాయకుడిగా, పార్టీ అధినేతగా జగన్‌ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.