బాహుబలి, బాహుబలి-2 సినిమాలలో అన్ని పాత్రలకంటే ఎక్కువ పేరు తెచ్చుకున్న పాత్ర పేరు కట్టప్ప. అందుకే ఫిల్మ్ మేకర్స్ కూడా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అన్న ప్రశ్న చుట్టూ పబ్లిసిటీ చేశారు. అలాంటి కట్టప్ప వైకాపా అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ జీవితంలో కూడా ఉన్నాడా? ఒక్క కట్టప్ప కాదు……. కట్టప్పలు ఉన్నారని జగన్ చెప్తున్నాడు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా దళితుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న జగన్ దళితులకు భారీ వరాలిచ్చాడు. దాంతో పాటు దళితులతో వైఎస్‌ల కుటుంబానికి ఉన్న అనుబంధాల గురించి కూడా చెప్పుకొచ్చాడు.
వైఎస్‌ల ఇంట్లో బ్రాహ్మణ కులం నుంచీ రెడ్డి, కమ్మ, కాపు, ఎస్సీ, ఎస్టీ….. ఇలా అన్ని కులాల వాళ్ళతోనూ పెళ్ళిళ్ళు జరిగాయి. అలా దళితుల ఇంటితో బంధుత్వం నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ‘మామా’ అని ఆత్మీయంగా పిలిచేవాడట జగన్. ఇప్పటికీ కూడా బంధుత్వంతో సంబంధం లేకుండా దళితులను మామ అని సంబోధించడంలో తనకు చాలా ఆనందం ఉంటుందని……అన్ని కులాలతోనూ సంబంధ బాంధవ్యాలు కలుపుకున్న గొప్ప మనసు వైఎస్ రాజశేఖరరెడ్డిదని……‘ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా’ అని నీచంగా మాట్లాడే స్థాయి చంద్రబాబుదని చెప్పుకొచ్చాడు జగన్. ఎంచి చూడగా మనుజులందన మంచిచెడులు రెండే కులములు. మంచి అన్నది మాల అయితే నేను మాలనవుతాను అన్న గురజాడ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఈ విషయాలు చెప్పుకొచ్చాడు జగన్.
‘మామా’ అని ఆత్మీయంగా పిలుస్తాను అన్న జగన్ మాటల నేపథ్యంలో జగన్ కోసం నిలబడే ‘కట్టప్ప’లం అవుతాం అని ఆ సభాప్రాంగణంలోనే దళితులు మాట్లాడుకోవడం కనిపించింది. సోషల్ మీడియాలో కూడా జగన్ జీవితంలో ‘మామా’ అని ఆత్మీయంగా పిలుచుకునే స్థాయి కట్టప్పలు చాలా మంది ఉన్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.