కాపుల రిజర్వేషన్ అంశంపై వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా మరో సారి చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. 2014 ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పిన చంద్రబాబు మోసగాడని విమర్శించారు. టీడీపీ మ్యానిఫెస్టోలో చేర్చింది నిజంకాదాని ప్రశ్నించారు.
ముద్రగడ పద్మనాభం రిజర్వేషన్లపై ఉద్యమం చేపట్టిన తర్వాతే చంద్రబాబు కమిషన్ వేశాడని గుర్తు చేశారు. రిజర్వేషన్లపై పోరాడుతున్న ముద్రగడకు వైఎస్సార్‌సీసీ మద్దతు ఇచ్చిందని అన్నారు. కాపు రిజర్వేషన్లపై మంజునాథ కమిషన్ ఇచ్చిన రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా తూతూ మంత్రంగా కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు.
కాపుల అభివృద్ధికి అయిదేళ్లలో 5 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పిన చంద్రబాబు కేవలం 1300 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు మాట తప్పడం, వెన్నుపోటు పొడవడం కొత్తకాదని అన్నారు. బాబుకు కాపుల ఓట్లపై ప్రేమ ఉంది కానీ, వారి సంక్షేమంపై లేదని అన్నారు.
వైఎస్సార్‌సీసీ అధికారంలోకి వస్తే కాపుల సంక్షేమానికి 10 వేల కోట్ల కేటాయిస్తామని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాపు రిజర్వేషన్‌పై వైఎస్ జగన్ అన్న మాటల్ని టీడీపీ నేతలు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు.