ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరునాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు నాయుడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు 23 మందిని కొనుగోలు చేయడంతో పాటు నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగానే అవిశ్వాస తీర్మానం నోటీసులపై చర్చ జరగకుండా చేశారని, పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చకున్నా టీడీపీ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు.
తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నిప్పులా బతికానని, కత్తిలాంటి వాణ్నని చంద్రబాబు అంటున్నారు.దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన కత్తి ఏపీ సీఎం చంద్రబాబేనని ఎద్దేవా చేశారు. దివంగత నేత వంగవీటి మోహనరంగాను హత్య చేయించింది చంద్రబాబేనని అప్పటి హోం మంత్రి హరిరామ జోగయ్య తన పుస్తకంలో రాసినట్లు ఈ సందర్భంగా భూమన గుర్తుచేశారు. అధికారంలో ఉన్నప్పుడు శవాలు కూడా కనిపించకుండా హత్యలు చేయించిన ఘనత చంద్రబాబుకు దక్కిందన్నారు.
ప్రత్యేక హోదాను ఇస్తామన్న హామీని దగగా మార్చారని, హోదా హామీ మాటలకు చంద్రబాబు సమాధి కట్టారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రుల జీవితాలను బుగ్గిపాలు చేసిన చంద్రబాబుకు అనవసర ఆర్భాటమే ఎక్కువని ఎద్దేవా చేశారు.