వ్యవసాశాఖ మంత్రి సోమిరెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం నుంచి మంత్రుల వరకు అంతా సమీక్షల పేరుతో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. సోమిరెడ్డికి వ్యవసాయం గురించి తెలుసా అని ప్రశ్నించారు. పంటల కాలంలో రైతుల బాగుకోసం పనిచేయని మంత్రి అధికారం ముగిసిపోనున్న తరుణంలో సమీక్షలు చేయడమేంటని కాకాని గోవర్ధన్‌రెడ్డి చురకలంటించారు.
వ్యవసాయ సీజన్ ఎప్పుడో కూడా చంద్రమోహన్‌రెడ్డికి తెలియదని ఎద్దేవా చేశారు. తుపాన్ పేరుతో డబ్బులు దొబ్బేయడానికే ఈ డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు సమీక్షలు చేయలేదని ప్రశ్నించారు. మీ అవినీతిని సీఎస్ అడ్డుకుంటే మంత్రులు, ముఖ్యమంత్రి గొడవ చేస్తున్నారన్నారు.
సోమిరెడ్డి సమీక్షకు అధికారులు రాకపోతే గంటపాటు డిస్కోడాన్స్ చేశారంటూ ఎద్దేవా చేశారు. రైతు రుణాల్ని ఎందుకు మాఫీ చేయలేదంటూ కాకాని ప్రశ్నించారు. సోమిరెడ్డి వ్యవసాయమంత్రి కాదు కిరాయిమంత్రి అంటూ విమర్శలు గుప్పించారు.సీఎం చంద్రబాబు నాయుడు ఎవరిని తిట్టమంటే వారిని తిట్టడానికే ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారని విమర్శలు చేశారు.