జనసేన అధినేత పవన్‌పై మరో సారి ఘాటుగా విమర్శించారు వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజా. అసలు పవన్‌కు బుర్రలేదని మండిపడ్డారు. జగన్, వైసిపిపై పవన్ చేసిన వ్యాఖ్యలపై రోజా జనసేనాధిపతిపై రెచ్చిపోయారు. పవన్ చేస్తున్న పనులకు, మాట్లాడుతున్న మాటలకు ఏమాత్రం పొంతన లేదన్నారు. బాబు ఎప్పుడు సమస్యలు వస్తాయో అప్పుడు పవన్ ప్యాకేజి ఇచ్చి బయటకు తీసుకొస్తున్నారన్నారు. ‘చంద్రబాబుది తల్లి టిడిపి అయితే, జనసేనది పిల్ల టిడిపి అని ఎద్దేవ చేశారు.
తప్పు చేసిన చంద్రబాబును కాపాడేందుకే పవన్ బయటకు వస్తున్నారు కానీ నిజంగా చంద్రబాబును నిలదీయటానికి మాత్రం రావటం లేదని స్పష్టం చేశారు. జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్ కు లేదని తేల్చేసారు. జగన్, అనుభవం గురించి మాట్లాడుతున్న పవన్ లోకేష్ కు ఏమి అనుభవం ఉందని మంత్రయ్యారని నిలదీసారు. పిల్లనిచ్చి చేరదీసిన ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రైన చంద్రబాబులో ఏమి అనుభవం కనిపించింది పవన్ కు అంటూ ధ్వజమెత్తారు.
వైసిపి పెట్టకముందే జగన్ ఎంపిగా గెలిచిన విషయం పవన్ కు తెలీదా? అంటూ ప్రశ్నించారు. ఏం అనుభవంతో చిరంజీవి, పవన్ పిఆర్పీని పెట్టారంటూ మండిపడ్డారు. చంద్రబాబు రాసిచ్చిన స్ర్కిప్ట్ మాట్లాడటానికి తప్ప పవన్ ఎందుకు పనికిరాడని రోజా తేల్చేసారు.
కృష్ణానదిలో ఓ బోటు బోల్తా పడిందన్న విషయం ఎక్కడో లండన్‌లో ఓ విద్యార్థి చెబితే తెలిసిందంటే అంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా అన్నారు. ఒక పార్టీ పెట్టి పెట్టి ప్రజల కోసం పోరాడుతాను, ప్రశ్నిస్తానన్న పెద్ద మనిషి ఈ రాష్ట్రంలో పుట్టి, ఈ రాష్ట్రంలో ఉంటూ, నాకు తెలియలేదు, ఎవరో అడిగితే ఆలోచిస్తున్నాను అని చెప్పడం ఏమిటన్నారు. నీలాగా షూటింగ్ గ్యాప్‌లలో వచ్చి సమస్యలపై జగన్ పోరాడటం లేదని ఎద్దేవా చేశారు. జగన్ నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారని రోజా చెప్పుకొచ్చారు.