సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశ పెడుతున్న 2018-19 బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. పోలవరం ప్రాజెక్టుకు, రాజధాని అమరావతికి భారీగా నిధులు, విశాఖ రైల్వే జోన్ తదితరాలతో పాటు రైల్వే ప్రాజెక్టుల విషయంలోను నవ్యాంధ్ర ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. కాని ఆశలు అడియాశలయ్యాయి.
వచ్చే సాధారన ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ ఇదే కావడంతో గంపడాశలు పెట్టుకున్నారు ఏపీ నేతలు. బడ్జెట్‌లో ఏపీకీ జరిగిన అన్యాయంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎంపీలు రాజీనామా వ్యవహారంపై స్పందించారు. బడ్జెట్‌లో ఏపీకీ పూర్తి అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాజీనామా ప్రకటనకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని మరోసారి వైసీపీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమైన టీడీపీ ఎంపీలు బడ్జెట్ లో జరిగిన అన్యాయంపై ఏ విధంగా సమాధానం చెప్తారో ముందు చెప్పమనండి అన్నారు. తాము రాజీనామా చేస్తే విభజన చట్టంలోని హామీలను, ప్రత్యేక హోదా పై కేంద్రాన్ని పార్లమెంట్ లో ప్రశ్నించేవారు ఉండరని వారు గుర్తు చేశారు.
ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని, ఒక వేళ ఈ సమావేశాల్లో కేంద్రం విభజన హామీలు, హోదా విషయాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోని పక్షంలో తమ అధినేత వైయస జగన్ తో చర్చించి రాజీనామా చేస్తామని ప్రకటించారు.