Tuesday, May 13, 2025
- Advertisement -

JFFC కాదు BFFC: బాబు కోసం ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ…

- Advertisement -

జాయింట్ యాక్షన్ కమిటీ అని ఆరున్నొక్క శృతిలా రాగం తీసిన పవన్ తెలంగాణా కోసం కోదండరామ్ చేసినట్టుగా ఉద్యమ బాట పట్టి సమాజాన్ని కదిలిస్తాడేమో అన్న ఆశలు కల్పించాడు. బాబు భజన మీడియా అంతా కూడా ఒక రోజంతా ప్రజల్లోకి పవన్, ఉద్యమ బాటలో పవన్ అని ఊదరగొట్టింది. కట్ చేస్తే అసలే ఎండాకాలం వస్తోంది…. ఆ పైన ప్రజల్లోకి వెళ్తే చంద్రబాబుని విమర్శించకుంటే మరీ బఫూన్ అవుతున్న పరిస్థితుల్లో నేపథ్యంలో ఎంచక్కా ఫైవ్ స్టార్ హోటల్‌లో ఎసి గదుల్లో కూర్చుని ప్రజల కోసం పనిచేస్తున్నాం అని కలరింగ్ ఇచ్చే ఛాన్స్ ఉండేలా చాలా తెలివిగా ‘జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ’ అని 2019 ఎన్నికల వరకూ సాగదీసే అవకాశం ఉన్న మార్గాన్ని ఎంచుకున్నాడు పవన్. కనీసం నిజాలు బయటికి తీసి జనాల్లో అవేర్‌నెస్ తీసుకొస్తాడేమో అని ఆ తర్వాత కూడా పవన్‌పై కొంతమంది ఆశలు పెట్టుకున్నారు. అయితే తన అసలు రంగులన్నీ పూర్తిగా బయటపెట్టేశాడు పవన్. ఆ పచ్చ రంగు కనపడకుండా ఉండడం కోసం ఐవీఆర్ లాంటి బాబు వ్యతిరేకులను కూడా తీసుకున్నాడుకానీ వాళ్ళ పరిస్థితి బాబు ప్రభుత్వంలో ఉన్న కాపు మంత్రులు, మోడీ గవర్నమెంట్‌లో ఉన్న మైనారిటీ మంత్రుల లాంటిదే అని ఎవరైనా ఇట్టే చెప్పొచ్చు. అసలు నాటకం అంతా బాబు భజనదాసులయిన పవన్, జయప్రకాష్ నారాయణలదే. బాబు కోసం ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పడానికి మనం పవన్‌లాగా ఫైవ్ స్టార్ హోటల్‌లో కూర్చుని చర్చించాల్సిన అవసరం, అధ్యయనం చేయాల్సినంత మేటర్ కూడా లేదు. అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం ఎవరు చేశారు , ఏ మేరకు చేశారు అని అధ్యయనం చేయడానికి కూడా కమిటీ అవసరం లేదు. కానీ 2019 ఎన్నికల వరకూ కాలయాపన చేయాలంటే మాత్రం కమిటీ కావాలి. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ బాబు, బాబు భజన మీడియాలు కలిసి ఆంధ్రప్రదేశ్ ఓటర్ల నెత్తిన రుద్దిన నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌కి తీవ్ర అన్యాయం చేశాడు. నాలుగేళ్ళుగా ఆ అన్యాయాన్ని బాబు తన స్వార్థం కోసం పూర్తిగా సమర్థిస్తూ వచ్చాడు. అలా మోడీవారు ఎపిని అథోగతి పాలు చేస్తూ ఉంటే బాబుగారు తన పచ్చ కుటుంబ స్వార్థం కోసం ఐదు కోట్ల ఆంధ్రుల జీవితాలను ఫణంగా పెట్టేశాడు. ఇప్పుడు నాలుగేళ్ళుగా మోడీ దగ్గర సాగిలపడి మా జీవితాలను ఎందుకు ఫణంగా పెట్టావ్ అన్న ప్రశ్నకు బాబు సమాధానం చెప్పాలి? ఆ విషయంలో బాబును సమర్థించడానికే ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. కావాలంటే కమిటీ సారథులు జెపి, పవన్‌ల మాటలు పరిశీలించండి.

……..‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఎలా ఖర్చుపెట్టిందో కేంద్రానికి చెప్పాల్సిన అవసరం లేదు’………..అమూల్యమైన ఈ డైలాగ్ కలెక్టర్‌గా పనిచేసిన జయప్రకాష్ నారాయణది. ఈ మాటలు విన్న వెంటనే జెపి ఐఎఎస్ ఎలా పాసయ్యాడా? అన్న ఆలోచన వచ్చింది. జెపిగారు కలెక్టర్‌గా పనిచేసినప్పుడు ప్రభుత్వ నిధులు ఎలా ఖర్చుపెట్టాడో రాష్ట్ర ప్రభుత్వానికి లెక్కలు చెప్పలేదా? అలాగే మండలం, గ్రామ స్థాయిలో నిధులు ఎలా ఖర్చు చేస్తున్నారో లెక్కలు తెప్పించుకోలేదా? మరీ బాబు బానిసత్వం ఆలోచనలు ఏ స్థాయిలో ఉంటే మాత్రం కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఎలా జెపి? ఆంధ్రప్రదేశ్ ఏమైనా బాబు నియంతృత్వంలోని ప్రత్యేక దేశం అనుకుంటున్నారా ఏంటి?

మేథావి మేథావి అని పచ్చ బ్యాచ్ మొత్తం ఆకాశానికి ఎందుకు ఎత్తుతూ ఉంటుందో ఇప్పుడు అర్థమైందా? మార్గదర్శి అక్రమాలను ప్రశ్నిస్తే మీడియాపై దాడిగా అభివర్ణిస్తూ పేజీలకు పేజీలు ఖండన వార్తలు ఇచ్చిన సో కాల్డ్ మేధావి ఈ జెపి. అదే సాక్షి మీడియాపై డైరెక్ట్‌గా దాడి జరిగితే మాత్రం అది తప్పే కాదని అడ్డగోలు వాదన వినిపిస్తాడు. అలాంటి జెపి చంద్రబాబు తప్పులను, అవినీతిని సమర్థించడానికి ఎంత అడ్డంగా మాట్లాడేశాడో చూశారా?

ఇక పవన్ కళ్యాణ్ కానీ, జెపీ కానీ హోదా గురించి బాగానే మాట్లాడుతున్నారు. మరి హోదా అవసరం లేదు అని చెప్పి ప్యాకేజ్‌కి ఒప్పుకున్న చంద్రబాబుని ఎందుకు నిలదీయడం లేదు? హోదా ఉద్యమాన్ని ఉక్కుపాదంతో ఎందుకు అణచివేశాడు? హోదా కూడా ప్యాకేజ్‌తో సమానం అని, అన్నీ ఇస్తామని అరుణ్ జైట్లీ చెప్పబట్టే ప్యాకేజ్‌కి ఒప్పుకున్నా అని ఈ రోజు చంద్రబాబు అమాయకంగా చెప్తున్నాడు. ప్రపంచానికి పాఠాలు చెప్పా, అత్యంత అనుభవజ్ఙుడిని అని చెప్పుకునే బాబు అనుభవం ఇంతేనా? కేంద్రంలో ఎవరో ఏదో మాటలు చెప్పగానే ఎనకా ముందూ చూడకుండా జై కొట్టి ఆంధ్రప్రదేశ్‌ని నిండా ముంచేస్తాడా? ప్యాకేజ్ కంటే హోదా గొప్ప అని రాజకీయాలపై కాస్త అవగాహన ఉన్న ఏ ఆంధ్రప్రదేశ్ ఓటర్‌ని అడిగినా చెప్తాడు? అంత చిన్న లాజిక్ అంత అమాయకంగా చంద్రబాబు మిస్సయ్యాడంటే నమ్మాలా? అలా నమ్మినవాళ్ళును……..‘ఏంట్రా…హోదాకంటే ప్యాకేజ్ గొప్ప అంటే గుడ్డిగా నమ్మేసిన బాబులా తయారయ్యావ్’ అని జ్ఙానం ఉన్నవాళ్ళు కామెంట్ చెయ్యరా?

ఒకటి రెండు విషయాలు కాదు. అన్ని విషయాల్లోనూ ఈ బాబు భజన బ్యాచ్ కమిటీ సారథులు బాబు కోసమే పనిచేస్తున్నారు అన్నది నిజం. సమైక్యాంథ్ర ఉద్యమ సమయంలో కూడా తెలంగాణా వాదులను రెచ్చగొట్టి సీమాంధ్రులు నిండా మునగడంలో తన వంతు పాత్ర పోషించిన మేధావి(?) చలసాని శ్రీనివాస్ అయితే బాబు కోసం మరీ అడ్డంగా వాదిస్తూ ఉన్నాడు. వీళ్ళంతా బాబుతో సహా పచ్చ బ్యాచ్ ప్రయోజనాల కోసం పనిచేసే భజన జనాలే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు అన్నది మాత్రం నికార్సయిన నిజం.

ఇక బ్యాచ్ అంతా కూడా మోడీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని మాట్లాడడం, దానికి పచ్చ మీడియా అధినేత వంత పాడడం మాత్రం వింతల్లోకెల్లా వింత. ఇలాంటి కామెడీ వేషాలతోనే విభజన సమయం నుంచీ ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్‌ని పూర్తిగా అథోగతి పాలు చేస్తూనే ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -