రకరకాల వార్తలు వింటుంటాం. ఇప్పుడు మీరు వింటున్నది వార్తల్లోకెల్లా వింతైన వార్త. పెళ్లికూతురు మెల్లో తాలి కట్టేసమయంలో వధువు ఎవరితోనో లేచిపోయింది. ఇంకేముంది మగ పెళ్లివాళ్లు గొడవ చేస్తుంటే, వధువు చెల్లెలిని పెళ్లి కూతురిని చేయగా, వరుడు పారిపోయిన ఘటన ఇది.
ఈ సంఘటన ఏపీ సరిహద్దులకు దగ్గరగా కర్ణాటకలోని కోలారు జిల్లా చిన్నకల్లులో జరిగింది. వివరాల్లోకి వెల్తే గురేష్ అనే వరుడికి సౌమ్య అనే వధువుకు వివాహం నిశ్చయమైంది. శనివారం నాడు రిసెప్షన్ జరిపి, ఆదివారం పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. బంధుమిత్రులు, ఇరు వర్గాల పెళ్లివారు పెళ్లిని వైభవంగా జరిపించేందుకు సిద్ధమయ్యారు. అయితే, వివాహ ముహూర్తానికి సమయం మించిపోతున్నా పెళ్లి కూతురు మండపానికి రాలేదు. ఆమె తన ప్రియుడితో లేచి పోయినట్టు తెలుసుకున్న వరుడి తరఫు బంధువులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
దీంతో వధువు తరుపు బంధువులు సర్ధిచెప్పి సౌమ్య బాబాయి కుమార్తె వెంకటరత్నమ్మతో గురేష్ పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. నిశ్చితార్థాన్ని అప్పటికప్పుడు ముగించేశారు. మరికాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సి వుండగా, షేవింగ్ చేయించుకుని వస్తానని బయటకు వెళ్లిన గురేష్ తిరిగి రాలేదు సరికదా… తన ఫోన్ ను కూడా స్విచ్చాఫ్ చేశాడు. అయితే వరుడు కూడా ప్రియురాలి కోసం వెళ్లిపోయాడని కొందరు, పెళ్లి ఇష్టం లేక పారిపోయాడని మరికొందరు వ్యాఖ్యానించారు.