టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పటినుంచే అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. వరుస సభలు పెడుతూ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. కాదు కురిపిస్తానని హామీ ఇస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, వడ్డీలేని రుణాలిస్తామంటూ హామీల వర్షం కురిపించారు. చంద్రబాబు మాటలను నమ్మిన రైతులు, మహిళలు.. ఆయనను గద్దెనెక్కించారు. అధికార పీటమెక్కాక సింగపూర్ పర్యటనలు, అమరావతి గ్రాఫిక్స్ డిజైన్లలో పడి చంద్రబాబు ఈ విషయాన్నే మరిచిపోయారు.
కానీ మళ్లీ ఎన్నికలొస్తున్నాయి. మళ్లీ వారి ఓట్లు కావాలి. దీనికి ఏం చేయాలి? అన్న ఆలోచనలో పడ్డ చంద్రబాబుకు మరోసారి ఓ సభ నిర్వహించి వారికి తాయిలాలు ప్రకటించాలనుకున్నారు. అదే చేశారు. కడపలో పసుపు కుంకుమ సభ నిర్వహించారు. అన్ని జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులు పెట్టి మహిళలను తరలించారు. ప్రతి డ్వాక్రా మహిళకు రూ.10 వేలు, సెల్‌ఫోన్ ఇస్తామని ప్రకటించారు. ఇక్కడే ఓ మెలిక పెట్టారు చంద్రబాబు. ఇచ్చే పదివేల రూపాయలను చెక్కుల రూపంలో ఇస్తామని ఓ బాంబ్ పెల్చారు. అవి కూడా మూడు పోస్ట్ డేటేడ్ చెక్కులు. దీంతో బాబుగారి అంతరంగం మహిళలకు అర్థమైపోయింది.
తాము అనుకున్నదే అయిందంటున్నారు డ్వాక్రా మహిళలు. మాకు ఏదో చేస్తారని అంత దూరం నుంచి ప్రయాసపడి వస్తే తమ శ్రమ వృథా అయిందంటున్నారు ఇప్పుడు. ఫిబ్రవరి చివరి వారంలోనో.. లేదా మార్చిలోనో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది.. నోటిఫికేషన్ వెలువడగానే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. అప్పుడు చంద్రబాబు ఇచ్చిన చెక్కులు ఉండి కూడా ఉపయోగం లేదంటున్నారు.
ఇప్పటికే డ్వాక్రా మహిళలు రుణాలు, వడ్డీ చెల్లించనవసరం లేదు.. ప్రభుత్వమే చెల్లిస్తుంది అన్న బాబు మాటలు నమ్మి మోసపోయాం. బ్యాంకుల వారేమో ఇంటికి నోటీసులు పంపిస్తున్నారు. కొన్ని చోట్ల కోర్టు నుంచి నోటీసులు కూడా వస్తున్నాయంటున్నారు. బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని మరీ వడ్డీలు చెల్లించామని మరికొందరు మహిళలు తెలిపారు. తాము చెల్లించిన వడ్డీ డబ్బులను పదివేల రూపంలో.. కొత్త పథకం పేరుతో మళ్లీ ఇస్తున్నారని పెదవి విరుస్తున్నారు. కోర్టు నోటీసులు, అప్పుల బాధతో కొట్టుమిట్టాడుతుంటే చంద్రబాబు ఇచ్చే స్మార్ట్ ఫోన్లను ఏం చేసుకోవాలని మండిపడుతున్నారు. ఆర్థిక చేయూతనందిస్తే ఆ స్మార్ట్ ఫోన్లను తామే కొనుక్కుంటామంటున్నారు.
ఈ ట్వీట్‌ను చూస్తే అర్థమయ్యేది ఒకటే.. నేను మీకు ఇచ్చే డబ్బులకు బదులుగా నాకు ఓటేయండని చెబుతున్నారు చంద్రబాబు. అంటే అధికారికంగానే మీరు ఓటు వేసినందుకు డబ్బు ఇస్తున్నానని చెబుతున్నారు.
ఇక రాజమండ్రిలో ఏర్పాటు చేసిన జయహో సభలో బీసీలపై ఎనలేని ప్రేమ కురిపంచారు చంద్రబాబు. 11 బీసీ ఉపకులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నానని ప్రకటించారు. అంతేగాకుండా తమ కేబినెట్లో 8 మంది బీసీలు మంత్రులున్నారని.. అసలు బీసీలే టీడీపీకి వెన్నెముక అని ప్రకటించారు. కానీ అప్పుడే వీటిపై కౌంటర్లు ప్రారంభమయ్యాయి. దేశ ప్రధానిగా ఉన్న మోదీ ఓ బీసీ అని ఆయనంటే చంద్రబాబు, ఆయన బావమరిది బాలకృష్ణకు గౌరవం లేదని… అసలు బీసీలు జడ్జీలుగా పనికి రారని చంద్రబాబు లేఖ రాయలేదా? అంటూ బీజేపీ క్యాంప్ విమర్శిస్తుంటే.. బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు సరే.. మరి వాటి అధికారాలు చంద్రబాబు, లోకేష్ కబంధ హస్తాల్లో ఉన్నాయని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఓ ఎస్సైను కూడా బదిలీ చేసే అధికారం హోంమంత్రికి లేదని ఎద్దేవా చేస్తున్నారు.