వయసు ప్రభావం చంద్రబాబుపైన గట్టిగానే పడుతోంది. పోలవరం మొత్తం నడిచి తిరుగుతన్నాడు అంటూ ఎల్లో మీడియా బాబును యంగ్‌గా చూపించడానికి ఎంత తాపత్రయపడుతున్నా మరీ వయసును దాచేయడం అంటే అబద్ధపు హామీలు, చేతకాని మాటలను కవర్ చేసినంత ఈజీ కాదు కదా. వయసుతో పాటు బాబుకు ఛాదస్తం కూడా పెరిగిపోతూ ఉన్నట్టుంది. అలాగే తాను అధికారంలో ఉన్నాను అనే విషయం కూడా మర్చిపోతున్నట్టున్నాడు. కేంద్ర ప్రభుత్వంలో తాను కూడా భాగస్వామినని, టిడిపి నేతలు కేంద్ర మంత్రులుగా హోదాను ఎంజాయ్ చేస్తున్నారన్న విషయం మర్చిపోతున్నట్టున్నాడు చంద్రబాబు.
తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో వైకాపా ఎంపిలు ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌లాంటి హామీల కోసం ఎలా డిమాండ్ చేయాలి? పార్లమెంట్‌లో ఆంద్రప్రదేశ్ ప్రజల బాధలను, వాళ్ళకు దక్కాల్సిన ప్రయోజనాలను ఎలా ప్రస్తావించాలో, ఎలా పోరాటం చేయాలో తన ఎంపిలకు దిశానిర్దేశం చేశాడు జగన్. ప్రతిపక్షంలో ఉన్న జగన్ అంతకుమించి చేయగలిగింది ఏమీ లేదు. మన వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీలకు ఎక్కడ పేరొస్తుందో అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసిన ఏ ఒక్క పనినీ కూడా అధికార పార్టీలు నెరవేర్చవు అన్నది నిజం. ఒకవేళ పనులు చేసినా వాళ్ళు అడిగినప్పుడు కాకుండా కొంత కాలం తర్వాత చేసి అంతా తమ గొప్పే అని అధికార పార్టీలు చెప్పుకుంటాయి. పోరాటం చేయడం తప్ప ప్రతిపక్షాలు చేయగలింది ఏమీ లేదు. ప్రతిపక్ష పార్టీ అధినేతగా ఉన్న జగన్ తన బాధ్యత తాను నెరవేరుస్తున్నాడు.
వైకాపా ఎంపిలతో జగన్ సమావేశమైన మరుసటి రోజే చంద్రబాబు కూడా తన పార్టీ ఎంపిలతో సమావేశమయ్యాడు. ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయిన చంద్రబాబు, తన పార్టీ ఎంపిలకు కేంద్ర కేబినెట్‌లో మంత్రి పదవులు ఇప్పించుకున్న చంద్రబాబు కూడా సేం టు సేం జగన్ చెప్పిన మాటలే చెప్పాడు. ప్రత్యేక హోదాను తన స్వార్థం కోసం ఎప్పుడో బలిపెట్టేశాడు చంద్రబాబు. అందుకని ప్రత్యేక హోదా ప్రస్తావన తీసుకురాడు. అయితే తాను ముద్దు చేసి సంకనెక్కించుకున్న ప్యాకేజ్ విషయంలో కూడా కేంద్రం చేతులెత్తేయడంతో బాబు కక్కలేక మింగలేక సతమతమవుతున్నాడు. 2014 ఎన్నికల సమయంలో పదిహేనేళ్ళ పాటు ప్రత్యేక హోదా తెస్తా అన్న చంద్రబాబు…..అధికారంలోకి వచ్చాక ఓటుకు నోటుతో సహా బోలెడన్ని కారణాల రీత్యా హోదాకు మంగళం పాడేశాడు. హోదా వేస్ట్ అని చెప్పి సీమాంధ్ర ప్రజలను నమ్మించడానికి బాబు అండ్ కో అండ్ ఆయన భజన మీడియా అంతా కూడా ఇప్పటికీ నానా కష్టాలు పడుతున్నారు.
ఇక ఇప్పుడు ప్యాకేజ్ విషయంలో కూడా కేంద్రం చేతులెత్తేయడంతో బాబుకు ఏం చేయాలో తెలియడం లేదు. మోడీతో విభేదించి బయటికి వస్తే ఓటుకు నోటుతో సహా ఇతర కేసుల్లో బుక్ చేస్తాడని భయం. అందుకే ప్రజలను మాయ చేయడానికి ప్రతిపక్ష పార్టీ నేతలాగే మాట్లాడుతున్నాడు చంద్రబాబు. కేంద్రంలో తన పార్టీ భాగస్వామి కానట్టు, తన పార్టీ కేబినెట్ మంత్రులు లేనట్టుగా….తన ఎంపిలకు పోరాటం చేయండ అంటూ కబుర్లు, కహానీలు చెప్తున్నాడు. చంద్రబాబు చెప్పే ఇలాంటి పోరాట కహానీలనే ఆ మధ్య జేసీ దివాకర్‌రెడ్డి…..‘పోరాటమా……వంకాయా….’ అంటూ గాలి తీసిపడేశాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క ప్రయోజనం కూడా లేని నేపథ్యంలో హోదా, జోన్, ప్యాకేజ్, రాజధాని నిధులు ఇలా అన్ని విషయాల్లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిప్పే గతి అన్నట్టుగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు ఇప్పటికీ పొత్తు పెట్టుకుని ఉండడానికి వ్యక్తిగత స్వార్థం, తెరవెనుక ప్రయోజనాలు కాకుండా ఇంకేం కారణం ఉంటుందని అనుకోవాలి. అయినా అధికారంలో ఉన్నవాళ్ళు కూడా ప్రతిపక్ష నాయకుల్లాగే పోరాటం చేయండి అని మాట్లాడుతుంటే ఇక అలాంటి నాయకులకు అధికారం ఎందుకంట?