శివుడు అంటే కేవలం శివలింగం మాత్రమే అనకుంటారు భక్తులు. కానీ శివ పురాణం ప్రకారం మహాశివునికి 64 రూపాలు ఉన్నాయి. సామాన్యులకు ఈ 64 రూపాల గురించి తెలియవు. అయితే మహాశివుని 6 రూపాల గురించి మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలని పండితులు చెబుతున్నారు.
మొదటిది లింగోద్భవ పరమశివుడు. ఈ ఆకారంలొ పై రెండు చేతులలొ ఒకదానితో లేడిని మరొక చేతితో గొడ్డలిని పట్టుకుని దర్శనమిస్తాడు. మిగిలిన రెండు చేతులు భక్తులను దీవిస్తూ ఉంటాయి. ఈ ప్రతిరూపాలు సాధారణంగా శివాలయాల పడమటి గోడలపై కనిపిస్తాయి. రెండవది నటరాజేశ్వరుడు. ఈ రూపంలో మహా శివుడు నాట్య రూపంలో దర్శనమిస్తాడు. లయకారుడు తాండవ నృత్యం చేసేటప్పుడు మెరుపులు మెరుస్తాయి, పెద్ద పెద్ద కెరటాలతో సముద్రాలు పోటెత్తుతాయి. అదే ఆనంద నృత్యం చేసినపుడు ఈ అనంత విశ్వం ప్రశాంతంగా ఉంటుంది.
ఇక మూడవది దక్షిణామూర్తి రూపం. దక్షిణామూర్తి అంటే.. సత్యానికి, జ్ఞానానికీ ప్రభువు. దక్షిణామూర్తి ప్రతిరూపం శివాలయాలలోని దక్షిణ గోడలపై కనిపిస్తుంది. ఇక నాల్గవ రూపం అర్దనారీశ్వర రూపం. అర్ధనారీశ్వర రూపంలో జీవ సృష్టికి నిదర్శనంగా శివపార్వతులు ఇద్దరు కలిసి దర్శనమిస్తారు. ఈ రుపంలో పార్వతీపరమేశ్వరులు… స్త్రీ, పురుషులు ఇరువురు సమానమని , ఎవరు ఎవరికన్నా గొప్పవారు కాదని ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్నిస్తారు. ఇక ఐదవ రూపం గంగాధర రూపం. గంగాధర అంటే గంగను ధరించిన వాడని అర్ధం.
ఇక ఆరవ రూపం.. భిక్షాటన రూపం.. ఈ రూపం యొక్క ముఖ్య లక్ష్యం మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని నిర్మూలించడం. చతుర్భుజ సన్యాసిగా కనిపిస్తూ పరమశివుడు త్రిశూలం, ఢమరుకం, పుర్రెతొ ఉంటాడు. అలాగే కుడి చేతితో జింకకు ఆహారమిస్తూ కనిపిస్తాడు. ఇలాంటి పరమశివుని రూపాలు ఈ జగత్తులో మొత్తం 64 ఉన్నాయి.

