ప్రత్యేక హోదా ఇస్తే బిజెపికి మద్ధతివ్వడానికి రెడీ అని జగన్ చాలా స్పష్టంగా చెప్పాడు. అయితే బాబు అండ్ కో, పచ్చ మీడియా బ్యాచ్ అందరూ కూడా …..‘అదుగో….జగన్ బిజెపికి మద్దతిస్తానన్నాడు’ అంటూ ఆర్తనాదాలు మొదలెట్టారు. మైనారిటీలకు ద్రోహం చేస్తున్నాడు, తనపై ఉన్న కేసుల మాఫీ కోసమే మోడీకి మద్దతివ్వడానికి రెడీ అయ్యాడు అంటూ శోకాలు పెడుతున్నారు. మొత్తంగా ‘ప్రత్యేక హోదాకు మద్ధతు ఇస్తేనే బిజెపికి మద్ధతు ఇస్తా….ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వాళ్ళకు మద్ధతిస్తాను’ అని జగన్ చాలా స్పష్టంగా చెప్పిన మాటల్లో నుంచి ‘ప్రత్యేక హోదా ఇస్తేనే’ అన్న మాటలను ఎడిట్ చేసేసి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పేలుతున్నారు. సోషల్ మీడియాలో కూడా మోడీకి భయపడుతున్న జగన్ అని ప్రచారం మొదలెట్టారు.
బాగుంది……చాలా బాగుంది….వైఎస్ జగన్‌పై టిడిపి, పచ్చ మీడియా కుట్ర రాజకీయాలు కొత్తా కాదు….ఇది ఆఖరూ కాదు. అయితే ఇదే సందర్భంలో పచ్చ బ్యాచ్ అంతా కూడా కొన్ని విషయాలు మర్చిపోతున్నారు. వాళ్ళు కూడా కొన్ని ప్రశ్నలకు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అగత్యం ఉందన్న విషయం తెలుసుకోలేకపోతున్నారు. ప్రత్యేక హోదా ఇస్తేనే బిజెపికి మద్దతు ఇస్తానన్నాడు జగన్. ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్‌కి ఎన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు కొత్తగా ఎవరూ చెప్పనవసరం లేదు. 2014ఎన్నికల సమయంలో చంద్రబాబు, వెంకయ్యనాయుడు, పవన్ కళ్యాణ్, పచ్చ మీడియా అందరూ కలిసి చెప్పిన విషయాలు ఇప్పటికీ నెట్‌లో ఉన్నాయి. మరి అన్ని ప్రయోజనాలు ఉన్న ప్రత్యేక హోదా ఇస్తే మోడీకి మద్ధతిస్తాను అని జగన్ అంటున్నాడు. హోదా ముగిసిపోయిన అంశం కాదు…..ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నుంచి ప్రత్యేక హోదా కావాలన్న డిమాండ్‌తో అభ్యర్థన వస్తే పరిశీలిస్తామని చెప్పి ఈ వారంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన నీతి అయోగ్ వైఎస్ ఛైర్మన్……చంద్రబాబు పక్కనే కూర్చుని మరీ ప్రెస్ మీట్‌లో చెప్పాడు. ఇక ప్రధానమంత్రి తలుచుకుంటే ఒక్క సంతకంతో ప్రత్యేక హోదా ఇవ్వొచ్చని జగన్ చెప్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంజీవని(ఈ డైలాగ్ బాబుదే)లాంటి హోదా ఇస్తే మోడీకి మద్ధతిస్తాను అన్న జగన్ మాటల్లో తప్పేముంది?
ఇక 2014లో మోడీ మేనియా చూసి మోడీతో జత కట్టిన చంద్రబాబు నాలుగేళ్ళుగా మోడీతో కలిసి ఎందుకు సాగుతున్నట్టు? రాష్ట్రంలో కోసమే అని బాబు చెప్పే మాటల్లో అస్సలు అర్థమేలేదని తాజాగా ఢిల్లీలో ప్రధానిని కలిసిన తర్వాత బాబు మాట్లాడిన మాటల్లోనే అందరికీ తెలిసిపోయింది. ఆ ప్రెస్ మీట్‌లో ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడిన మాటలన్నింటినీ తన నోటివెంట వినిపించాడు చంద్రబాబు. హోదా పక్కన పెట్టినా ప్యాకేజీకి కూడా గతిలేదన్నాడు, రాజధాని నిధులకు దిక్కులేదన్నాడు, లోటు బడ్జెట్‌ని పూరించడం లేదన్నాడు, పోలవరం, రైల్వేజోన్‌తో సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమీ చేయడం లేదని ఆక్రోశం వెలిబుచ్చాడు. ఈ మాటలన్నీ మూడున్నరేళ్ళుగా జగన్ చెప్తున్నవే. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగేళ్ళుగా ఏమీ చేయని మోడీతో చంద్రబాబు ఎందుకు ఇంకా పొత్తుపెట్టుకుని ఉన్నట్టు? కేంద్ర ప్రభుత్వంలో టిడిపి మంత్రులు కూడా ఉండగా కోర్టుల్లో కేసులు వేస్తా అని వ్యర్థ ప్రేలాపనలు చేసి ఎవరిని మోసం చేస్తున్నట్టు? ఆ వెంటనే ఢిల్లీ నుంచి హెచ్చరికలు రాగానే….. కేసులు వేస్తానన్నది కేంద్రంపైన, మోడీపైన కాదు అని …మీడియా తన మాటలను వక్రీకరించింది అని ఎందుకు తత్తరపాటుతో ఖండన ప్రెస్ మీట్ పెట్టినట్టు?
ఢిల్లీలో చంద్రబాబు చెప్పినట్టుగానే నాలుగేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నయాపైసా సాయం చేయని మోడీతో ఇంకా కొనసాగుతున్నాడంటే ఆయన వ్యక్తిగత స్వార్థం, ఆయనపై ఉన్న కేసుల కోసం కాకుండా రాష్ట్రం కోసం అని ఎవరైనా నమ్ముతారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమీ చేయకపోయినప్పటికీ మోడీ దగ్గర సాగిలపడిపోయి…కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా ఏళ్ళ తరబడి అవమానించినా కిక్కురుమనకుండా పడి ఉన్న చంద్రబాబుకంటే…….ప్రత్యేక హోదా ఇస్తేనే మోడీకి మద్ధతు అన్న జగన్ ఏ రకంగా మోడీకి భయపడ్డట్టు? ఒకవేళ జగన్ ఆశించినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే……వైకాపా పార్టీ మోడీతో జట్టుకడితే నష్టం ఏంటి? అందులో తప్పు ఏమీ ఉంది?
నాలుగేళ్ళుగా దోసిలి మట్టి, చెంబుడు నీళ్ళు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నయాపైసా సాయం చేయకపోయినప్పటికీ….తీవ్రంగా అవమానిస్తూ ఉన్నప్పటికీ(బాబును మోడీ అవమానిస్తున్నాడు అన్నది కూడా బాబుతో సహా టిడిపి నేతలు, పచ్చ మీడియా అంతా చెప్పే మాటే) మోడీతో కలిసి సాగుతున్న చంద్రబాబు మోడీ అంటే భయపడుతున్నట్టు కాదా? తన వ్యక్తిగత స్వార్థం కోసం మోడీ దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నట్టు కాదా? ప్రత్యేక హోదా ఇస్తేనే మోడీతో పొత్తుపెట్టుకుంటా అన్న జగన్ మాత్రం మోడీ దగ్గర సాగిలపడుతున్నట్టా? ఇలాంటి నీచ, నికృష్ట రాజకీయాలతోనే కదా స్వామీ…..వైఎస్ చనిపోయిన తర్వాత నుంచీ కూడా సీమాంధ్ర ప్రజలందరినీ కూడా నమ్మించి నట్టేట ముంచుతూ ఉన్నారు.