2014 ఎన్నికల ముందు వరకూ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫ్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు చంద్రబాబు. కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఏ ఒక్క విషయంలో కూడా స్పష్టంగా తన అభిప్రాయాలను చంద్రబాబు ఎప్పుడూ చెప్పింది లేదు. ఇక ఎన్నికల ముందు నాటి పరిణామాలన్నీ కూడా తన రాజకీయ జీవితాన్ని అంతం చేయడానికే జరుగుతున్నాయని కూడా ప్రజలను నమ్మించడంలో టిడిపి అండ్ ఎల్లో మీడియా మొత్తం సక్సెస్ అయింది. అయితే ఇప్పుడు మాత్రం రంగులన్నీ అందరికీ తెలిసిపోతున్నాయి.
కుమ్మక్కు రాజకీయాలు ఎవరు నడిపారో అందరికీ స్పష్టంగా అర్థమవుతోంది. రాష్ట్ర విభజన త్వరగా ఎందుకు చేయరు అని చెప్పి దేశంలో ఉన్న పార్టీల నాయకులు అందరినీ కలిసిన చరిత్ర టిడిపిది. ఇక రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీసుకోవడంలో సోనియాగాంధీ ఎందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారని? వెంటనే ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ఆంధ్రప్రదేశ్ గడ్డపై నుంచి ఆవేశంగా నిలదీశాడు చంద్రబాబు. అలాగే అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కి చివరి ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్‌రెడ్డి పూర్తికాలం ముఖ్యమంత్రిగా కొనసాగించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. వైఎస్ జగన్ పార్టీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిరాయించిన తర్వాత మైనారిటీలో పడిన కిరణ్ సర్కార్‌ని కాపాడింది అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబే మరి. అయితే అప్పట్లో ఆ విషయాన్ని తీవ్రంగా ఖండించాడు చంద్రబాబు. కిరణ్ కుమార్‌రెడ్డి కుటుంబంతో తనకు ఆజన్మ శతృత్వం ఉందని…. అలాంటి కిరణ్‌కి తాను ఎందుకు మద్ధతు ఇస్తానని విమర్శకులపై విరుచుకుపడ్డాడు చంద్రబాబు.
బాబు భజన పత్రిక, ఎల్లో మీడియా తోక పత్రిక యజమాని కూడా చంద్రబాబుకి కిరణ్ కుమార్‌రెడ్డి కుటుంబానికి ఫ్యాక్షన్ కంటే గొప్ప శతృత్వం ఉందని….కిరణ్‌కి చంద్రబాబు మద్ధతు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పారు. అదేంటంటే వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించే సందర్భంలో కనీసం దశాబ్ధాలుగా వస్తున్న మర్యాదకు కూడా తిలోదకాలిచ్చిన చంద్రబాబు కిరణ్ కుమార్‌రెడ్డిని స్పీకర్ కుర్చీ వరకూ తీసుకువెళ్ళలేదని రాసుకొచ్చారు. ఆ విషయం నిజం కూడా. కానీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తే కిరణ్ కుమార్‌రెడ్డి సర్కార్‌ని చంద్రబాబే నిలబెట్టాడన్న విషయం కూడా పచ్చి నిజం.
ఈ రోజు అదే కిరణ్ కుమార్‌రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరుతున్నాడు. మరి నాడు చంద్రబాబుతో పాటు ఆయన భజన పత్రికాధినేత చెప్పిన శతృత్వం ఏమైంది? రాజకీయ స్వార్థం కోసం శతృత్వాన్ని కూడా పక్కనపెట్టేశారా? కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు చేసింది ఇదే అన్న నాటి రాజకీయ విశ్లేషకుల మాటలను ఇప్పుడు బాబు అండ్ కో ఖండించగలరా? మొత్తానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోకుండా చంద్రబాబు చేసిన కుట్ర రాజకీయం నేటి పరిణామాలతో చాలా స్పష్టంగా రాజకీయాలపై అవగాహన ఉన్నవాళ్ళకు అర్థమవుతోంది. నాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడకుండా ఉండి ఉంటే….. ఆ తర్వాత రాష్ట్ర విభజనతో సహా ఎన్నో విషయాల్లో చరిత్ర మరోలా ఉండేదని రాజకీయ మేధావులు ఇప్పుడు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.
ఇక 2014 ఎన్నికల సమయంలో కెసీఆర్‌తో జగన్ కుమ్మక్కయ్యాడని విష ప్రచారం చేశారు బాబు అండ్ కో. కెసీఆర్‌పై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడిపోతున్నాడని, జగన్ మాత్రం కెసీఆర్‌ని ఒక్క మాట కూడా అనడం లేదని బాబు భజన మీడియా కూడా కథనాలు రాసింది. మరి ఇప్పటి పరిణామాలను పరిశీలిస్తే అదే కెసీఆర్‌తో రాసుకుపూసుకు తిరుగుతున్నది ఎవరో? కెసీఆర్ కుటుంబంతో సత్సంబంధాలు పెంచుకోవడంతో పాటు వ్యాపార వ్యవహారాల్లో కూడా కెసీఆర్ మెప్పు పొందుతున్నది ఎవరో ఇట్టే అర్థమవుతోంది. చంద్రబాబు కుడిభుజం లాంటి యనమల వారే కెసీఆర్‌ని వేనోళ్ళ పొగుడుతారు. టిడిపి-కెసీఆర్ బంధాన్ని రేవంత్ రెడ్డి సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టాడు.
2014 ముందు నుంచీ ఇప్పటి వరకూ జరిగిన, జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే అర్థమయ్యేది ఒకటే. చంద్రబాబు మాట ఒకటి ఉంటుంది… చేతలు మరోలా ఉంటాయి. అన్నింటికీ మించి చంద్రబాబు చెప్పే మాటలకు…… తెరవెనుక ఆయన నడిపే రాజకీయాలకు అసలు పొంతనే ఉండదు. వ్యవహారం అంతా కూడా పూర్తి రివర్స్‌లో ఉంటుంది. ఈ మొత్తం పొలిటికల్ డ్రామాలను అర్థం చేసుకున్న తర్వాత అయినా 2019 ఎన్నికల సమయంలో ఇంకా గొప్పగా రచించబోయే వ్యూహాలు, కొత్త కొత్త డ్రామాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమవుతాయా?