చంద్రబాబునాయుడిపై తెలుగు దేశం నాయకులకు స్పష్టత వచ్చేసిందా? తెలంగాణా టిడిపి నాయకులకు ఓటుకు కోట్లు కేసులో బాబు ఇరుక్కున్నవెంటనే విషయం అర్థమైపోయింది. కెసీఆర్ దగ్గర బాబు ఏ స్థాయిలో సాగిలపడబోతున్నాడో పార్టీ అంతర్గత మీటింగ్‌లలో నాయకులకు బాబు సర్దిచెప్పిన విధానంతోనే స్పష్టమైపోయింది. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కనీసం కెసీఆర్ పేరు కూడా ప్రస్తావించే ధైర్యం చేయలేకపోయాడు బాబు. కెసీఆర్ దగ్గర చంద్రబాబు పూర్తిగా సాగిలపడడంతో తెలంగాణాలో టిడిపి నాయకులందరూ వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు. క్యాడర్ కూడా చీలిపోయింది.
ఇప్పుడిక ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లోనూ కనిపిస్తోంది. బిజెపి నేతలు చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. బిజెపిలో ఉన్న కింది స్థాయి నేతలు కూడా చంద్రబాబుతో పాటు టిడిపి నాయకులందరినీ ఉతికి ఆరేస్తున్నారు. నిన్నటికి నిన్న పార్టీ అంతర్గత సమావేశంలో బిజెపి మంత్రులు టిడిపి ప్రభుత్వం నుంచి వైదొలగాలని తీర్మానించేశారు. అలాగే బాబుతో చర్చకు సిద్ధం అని బాబుకే సవాల్ విసిరారు. చర్చకు రెడీనా అని అంతకుముందు బిజెపి నేతలకు సవాల్ విసిరిన చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయ్యాడు. తనపైన కేసులు ఉన్నప్పటికీ జగన్ మాత్రం ఎంపిల చేత రాజీనామా చేయించడానికి, ఢిల్లీ వేదికగా ధర్నా చేయడానికి…..అన్నింటికీ మించి అవిశ్వాస తీర్మానానికి కూడా రెడీ అన్నాడు. టిడిపి పెట్టినా సమర్థిస్తాం. టిడిపి సమర్థిస్తానంటే మేం పెట్టడానికి అయినా రెడీ అన్నాడు. అవిశ్వాస తీర్మానానికి బాబును ఒప్పించాలని బాబు భజనసేనుడు పవన్‌కి సవాల్ విసిరాడు.
ఈ మొత్తం పరిణామాలతో జగన్‌కి అడ్వాంటేజ్ వచ్చింది. మోడీకి జగన్ భయపడుతున్నాడు అని ప్రచారం చేసిన చంద్రబాబే మోడీకి పూర్తిగా బానిసలా మారిపోయాడు అన్న క్లారిటీ టిడిపి నేతలకే వచ్చింది. అందుకే ఇప్పుడు టిడిపి సీనియర్ నేతలే రాజకీయ భవిష్యత్ కోసం జగన్ వైపు చూస్తున్నారు. అయితే డైరెక్ట్‌గా వాళ్ళు జంప్ అయితే అధికారంలో ఉన్న చంద్రబాబు నుంచి సమస్యలు వస్తాయని వాళ్ళ సంతానాన్ని మాత్రం జగన్ పార్టీలోకి పంపిస్తున్నారు. త్వరలోనే టిడిపి నాయకుల వారసలు వైకాపాలోకి భారీగా చేరనున్నారని తెలుస్తోంది. సీట్లు పెరుగుతాయి అని నమ్మించి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వైకాపా ఎమ్మెల్యేలను కొన్న బాబుకు సీట్ల పెంపు లేదు అని మోడీ ఘాటుగా చెప్పడంతో దిక్కుతోచడం లేదు. మోడీతో పాటే మోడీని ఆంధ్రప్రదేశ్ ప్రజలపై రుద్దిన బాబుపై కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో పూర్తి స్థాయి వ్యతిరేకత ఉందని గుర్తించిన టిడిపి నేతలు ఇప్పుడు పరోక్షంగా జగన్‌తో జట్టు కట్టడానికి సిద్ధపడుతున్నారు. బాబు ఓడిపోవడం ఖాయం అని నమ్ముతున్న ఒక సీనియర్ మంత్రివర్యుడే తన కొడుకును వైకాపాలోకి పంపించేశాడు. త్వరలోనే అధికారికంగా చేరిక ఉంటుందట. సీటు విషయంలో గ్యారెంటీ లేకపోయినా జగన్ అధికారంలోకి వస్తే ఇబ్బందులు లేకుండా ఉండేందుకే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు తెలుగు ముఖ్యమంత్రుల చరిత్రలోనే నంబర్ ఒన్ బానిసగా మోడీ దగ్గర సాగిలపడుతూ ఉండడాన్ని సీనియర్ టిడిపి నేతలు కూడా సహించలేకపోతున్నారు. 2019లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టిడిపి పతనం ఖాయం అని అంచనాకు వచ్చిన ఈ నేతలు వారసుల భవిష్యత్తు కోసం జగన్‌కి జై కొట్టడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. టిడిపి సీనియర్ నేతల్లో చాలామందికి లోకేష్ నాయకత్వంపై అస్సలు నమ్మకం లేకపోవడం కూడా ఈ పరిణామాలకు కారణంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.