ఇంగ్లండ్ జట్టు భారత పర్యటన షెడ్యూల్ బుధవారం విడుదలైంది. టీమిండియాతో ఇంగ్లండ్ నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, అయిదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి పర్యటన మొదలవనుంది. ఇక సిరీస్ మొత్తంలో ఒకే ఒక డే అండ్ నైట్ టెస్టు అహ్మదాబాద్‌లో ఫిబ్రవరి 24వ తేదీన జరగనుంది. ఈ మ్యాచ్ మోతెరాలో కొత్తగా నిర్మించిన స్టేడియంలో జరుగుతుందని బీసీసీఐ కార్యదర్శి జే షా తెలిపారు.
కాగా, కరోనా భయాల నేపథ్యంలో భారత్‌లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు బ్రేకులు పడిన విషయం తెలిసిందే. 2020 మార్చిలో దక్షిణాఫ్రికాతో జరగాల్సిన సిరీస్‌ను రద్దు చేశారు. క్యాష్ రిచ్ టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను దుబాయ్‌లో నిర్వహించారు. ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఇదిలాఉండగా.. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని ఇంగ్లండ్‌తో జరిగే క్రికెట్ సిరీస్‌ను కేవలం మూడు వేదికల్లో మాత్రమే నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
ఇంగ్లండ్, టీమిండియా షెడ్యూల్ ఇదే
తొలి టెస్టు: ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు, వేదిక చెన్నై
రెండో టెస్టు: ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు, వేదిక చెన్నై
మూడో టెస్టు: ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు, వేదిక అహ్మదాబాద్ (డే అండ్ నైట్)
నాలుగో టెస్టు: మార్చి 4 నుంచి 8 వరకు, వేదిక అహ్మదాబాద్
ఐదు టీ20 మ్యాచ్‌లనూ అహ్మదాబాద్‌లోనే నిర్వహించనున్నారు. మార్చి 12, 14, 16, 18, 20 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక వన్డే మ్యాచ్‌లన్నీ పుణె వేదికగా జరగనున్నాయి. మార్చి 23, 26, 28వ తేదీల్లో వన్డే మ్యాచ్‌లు ఉంటాయని బీసీసీఐ కార్యదర్శి జే షా తెలిపారు.
