బీసీసీఐకి లా కమిషన్ ఆఫ్ ఇండియా షాకే ఇచ్చింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)కి షాక్ తగలనుంది. రాజ్యాంగంలోని 12వ అధికరణ ప్రకారం ప్రభుత్వ సంస్థగా బీసీసీఐని ప్రకటించేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని లా కమిషన్ చైర్మన్ జస్టిస్ బీ ఎస్ చౌహాన్ పేర్కొన్నారు. అలాగే, బీసీసీఐకి జవాబుదారీతనాన్ని కల్పించాలని కూడా ఆయన సూచించారు. దీంతో బీసీసీఐని ప్రభుత్వ సంస్థగా ప్రకటించి, జవాబుదారీతనం కల్పించేందుకు న్యాయ పరిశీలన సంఘం (లా కమిషన్) ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని లా కమిషన్ ఈ సిఫారసులు చేసింది. ఓ రాష్ట్రానికి ఉన్న అధికారాలను బీసీసీఐ అనుభవిస్తున్నది. ఇది అందులోని భాగస్వాముల ప్రాథమిక హక్కులపై ప్రభావం చూపుతుంది అని లా కమిషన్ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు సూచించింది. ఒకవేళ లా కమిషన్ సిఫారసును కేంద్రం ఆమోదిస్తే గనక.. ఇక నుంచి బీసీసీఐ తీసుకునే నిర్ణయాలపై కోర్టుల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేసుకోవచ్చు.
బీసీసీఐకి జవాబుదారీతనాన్ని కల్పించాలని లా కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ సంస్థ. ఇది ఇప్పటి వరకు తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ప్రైవేటు సంస్థగా పని చేస్తోంది. లా కమిషన్ చైర్మన్ జస్టిస్ బీ ఎస్ చౌహాన్ ఇటీవల మాట్లాడుతూ రాజ్యాంగంలోని అధికరణ 12 ప్రకారం ప్రభుత్వ సంస్థగా ప్రకటించడానికి బీసీసీఐకి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పిన సంగతి తెలిసిందే.
ఇప్పటినుంచి టీమ్ ఎంపిక, రాష్ట్రాలు, జోన్ల విషయంలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా వాటిని కోర్టుల్లో లేవనెత్తవచ్చు. బీసీసీఐ కుదుర్చుకునే ఒప్పందాలను కూడా కోర్టుల్లో సవాలు చేసే వీలుంటుంది. దేశంలో క్రికెట్ మొత్తాన్ని తమ చేతుల్లో పెట్టుకొని బీసీసీఐ అక్రమాలకు పాల్పడుతున్నదని లా కమిషన్ అభిప్రాయపడిది. ఇక ఆర్టీఐ చట్టం పరిధిలోకి బీసీసీఐని కచ్చితంగా తీసుకురావాలని కూడా కమిషన్ సూచించడం గమనార్హం.