మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి.. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాడని అందరూ భావిస్తారు. కానీ అసలు కారణం అది కానే కాదట. ఉద్యమాన్ని ప్రారంభించడానికి ఏడాదికి ముందే.. కేసీఆర్ మనసులో తెలంగాణ ఉద్యమ బీజం నాటుకుందట. ఈ విషయాన్ని స్వయానా ముఖ్యమంత్రి కేసీఆరే వెల్లడించారు. గురువారం రవీంద్రభారతిలో.. సీనియర్ పాత్రికేయుడు, ప్రెస్ అకాడమీ చైర్మన్ అమర్ రచించిన వ్యాస సంపుటి “హైదరాబాద్ డేట్‌లైన్“ని ఆవిష్కరించిన కేసీఆర్.. తన మదిలో ఉద్యమం మొలకెత్తిన విధానాన్ని వివరించారు. అదెలాగో ఆయన మాటల్లోనే చదవండి.
“నాకు మంత్రి పదవి ఇవ్వని కారణంగానే నేను తెలంగాణ ఉద్యమాన్ని రగిలించానని అంతా అనుకుంటున్నారు. కానీ.. అది నిజం కాదు. నేను తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ఏడాదికి ముందే.. దీనికి సంబంధించిన ఆలోచనకు బీజం పడింది. అప్పట్లో నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నాను. గ్రామాల సందర్శనకు వెళ్లినప్పుడు.. విద్యుత్ కనెక్షన్‌ల కోసం.. రైతులు దళారులకు లంచాలు ఇస్తున్న విషయం తెలిసింది. ఎవరెవరు ఎంతెంత ఇచ్చారో వివరాలు రాసుకుంటూ వచ్చా. చివరికి లెక్కేస్తే.. రైతులందరూ కలిసి దాదాపు 80 లక్షల రూపాయలు దళారులకు ఇచ్చినట్లు తెలిసింది. ఇదేంది..? ఎందుకిలా అని అధికారులను అడిగితే.. ఇక్కడ సాగునీటి వనరులు లేవు.. అందుకే రైతులంతా భూగర్భ జలాలపైనే ఆధారపడి బతుకుతున్నారు. కరెంటు కోసం ఇలా అవస్థలు పడుతూ.. లంచాలు కూడా ఇచ్చుకుంటున్నారని అధికారులు వివరించారు. దీనికి పరిష్కారం ఏంటి అంటే.. రైతులందరికీ ఒకే శ్లాబ్ ఉండాలని చెప్పారు. ఎన్టీఆర్‌ని కలిసి.. ఒప్పించి 3 హార్స్ పవర్ వాడే రైతులందరికీ ఒకే శ్లాబ్ ఉండేలా ప్రకటన చేయించా.
అయితే చంద్రబాబు సీఎం అయ్యాక.. దాన్ని మార్చేయాలని నిర్ణయించుకున్నాడు. 13 రూపాయలు ఉన్న రేటును ఏకంగా 85 రూపాయలకు పెంచాలనుకున్నాడు. నేను బాగా ఫైట్ చేసినా. ఎన్నో తర్జనభర్జనల తర్వాత శ్లాబ్ రేటును 35 రూపాయలు చేసేందుకు ఒప్పుకున్నా. ఇకపై రేటు పెంచబోమన్న హామీనీ తీసుకున్నా. కానీ, కొన్ని రోజులకే ప్రపంచబ్యాంకు ప్రభావంలో ఉన్న చంద్రబాబు.. నాకు తెలియకుండానే రైతుల కరెంట్ శ్లాబ్ రేటును అమాంతంగా పెంచేశాడు. అప్పట్లో తేజాటీవీ ఒక్కటే ఉండేది. రాత్రి భోజనం చేస్తున్న సమయంలో వార్తలు చూస్తుంటే రైతుల శ్లాబ్ రేటు పెంచినట్లు వార్త వచ్చింది. దాంతో చిర్రెత్తుకొచ్చి.. అప్పటికప్పుడు లెటర్ హెడ్ మీద నా అసంతృప్తిని స్వదస్తూరితో రాసి పంపా.
ఆ మర్నాడే 69లో తెలంగాణ కోసం ఉద్యమించిన వారు వచ్చి నన్ను కలిశారు. వారితో బైఠక్ అనంతరం.. నాలో తెలంగాణ ఉద్యమ ఆలోచన వచ్చింది. దీనిపై సుమారు మూడున్నర వేల గంటల పాటు మేథోమథనం చేశాను. కొన్ని వేల మందిని కలిసి చర్చించాను. అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించా. ఇంత తంతూ అయ్యాకే నేను మలి దశ ఉద్యమాన్ని ప్రణాళికాబద్ధంగా చేపట్టి.. చివరికి ఇలా రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ ఉద్యమానికి అందరూ అనుకుంటున్నట్లు మంత్రి పదవి కారణం కాదు.. రైతుల విద్యుత్ శ్లాబ్ చార్జీల పెంపే కారణం.”
తాను మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించడానికి గల కారణాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విధంగా చెప్పుకొచ్చారు.