హైదరాబాద్: 2019 ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జానాల్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నాలు చేస్తుూనే ఉన్నారు.
ఈ కోవలోనే పలు ప్రాంతాలపై దృష్టి సారించారు. జనసేన పార్టీ ఉనికిని తెలియజేస్తున్నారు. కొంత మంది ప్రజలు తమకు అండగా ఉండాలని జనసేన పార్టీని సంప్రదిస్తున్నారు. ఈ కోవలోనే పవన్ కళ్యాణ్ తన తరుపున ఒక టీంను రేపు భీమవరం పంపుతున్నారు. జనసేన బృందం అక్కడ పర్యటించి మెగా ఆక్వాపార్క్ బాధితులతో సమావేశం కానున్నారు. ఈ ఆక్వా పార్క్ నిర్మించనున్న ప్రాంతాన్ని కూడా ఈ టీం సందర్శిస్తుంది. అక్కడ రైతుల పరిస్థితిపై పూర్తిగా అధ్యయనం చేయనుంది. పూర్తి నివేదికను జనసేన ప్రతినిధులు పవన్ కళ్యాణ్‌కు అందిస్తారు.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ విషయంపై తగిన కార్యాచరణకు పూనుకుంటారు. రెండు నెలల కిందట ఆ ప్రాంత వాసులను హైదారాబాద్ రప్పించుకుని పవన్ మాట్లాడారు. మీడియా సమావేశం పెట్టి మరీ వారికి అండగా ఉంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జనసేన తరుపున నేతలను పంపారు. వీరిచ్చే నివేదిక ఆధారంగా స్వయంగా అక్కడకు వెళ్లాలా లేదా అనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయించుకోనున్నారు.