గెత్తి: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనంతపురంలో తన రెండో రోజు పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన గెత్తిలోని గేట్స్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రజా సమస్యలైతే బాధ, కోపం ఉంటాయని, కానీ మీ అందర్నీ చూస్తుంటే నాకు ఎలా మాట్లాడాలో తెలియండం లేదన్నారు.
అందుకే మీరేమైనా అడిగితే సామాధానమిస్తానని చెప్పారు. దీంతో ఒక బీటెక్ విద్యార్ధిని మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోయినప్పుడు ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేయడానికైనా, ఏం చేయడానికైనా సిద్దమన్నారు. కానీ అలాంటిదేమీ ఎందుకు జరగలేదని ప్రశ్నించింది.
దీనికి పవన్ స్పందిస్తూ.. ఒక సమస్యకు పరిష్కారం ఆవేశపడితే రాదని, ఆలోచించాలని అన్నారు. తాను ఆవేశపడనని, ఆలోచించే మాట్లాడతానని అన్నారు. యుద్దం చేసేటప్పుడు, యుద్దం ప్రకటించేటప్పుడు మన ప్రత్యర్ధులు ఎలా ప్రవర్తిస్తారో చూడాలన్నారు. మనం ఒక మాట మాట్లాడితే దానికి వాళ్ల వ్యూహం ఏంటి, ఎలా ప్రవర్తిస్తారో చూడాలన్నారు. దాన్ని బట్టే మన వ్యూహం కూడా మార్చుకుంటూ వెళ్లాలని అన్నారు. అలా కాకుండా మనం పట్టిన కుందేలుకి మూడే కాళ్లన్నట్టు ఉండకూడదన్నారు. సాధిస్తాను, పోరాటం చేస్తానన్నాగానీ ఇప్పటి వరకూ మానలేదు, మానను కూడా అని సమాధానమిచ్చారు.