ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మీద వైకాపా మహిళా నేత రోజా చేసిన వ్యాఖ్యలకి గట్టి రెస్పాన్స్ అందుతోంది. సాంఘిక సంక్షేమ మంత్రి కిషోర్ బాబు ఆమె మీద విమర్శలు చేసారు. ఎక్కడో యూపీలో బేదాభిప్రాయాలతో రాజకీయం వేడెక్కిన నేపథ్యంలో నేడు రాష్ట్రంలో చంద్రబాబు-లోకేష్ కు కూడా అంతర్గత విబేధాలున్నాయంటూ రోజా నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రాభివృద్ధిలో అహర్నిశలు కష్టపడుతున్న బాబును – పార్టీకి సమన్వయకర్తగా ఉంటున్న లోకేష్ గురించి ఇష్టానుసారంగా మాట్లాడడం సమంజసం కాదని అన్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే రోజా ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటుండటం చూస్తే ఆమె మానసిక పరిస్థితిపై అనుమానం కలుగుతోందని రావెల వ్యాఖ్యానించారు. రోజా ఏదైనా మానసిక ఆసుపత్రిలో చెక్ చేయించుకోవాలని కోరారు. ఒకవేళ ఆమె సిద్ధపడకపోతే ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద మానసిక వ్యాధికి ఉచితంగా చికిత్స చేయిస్తామని రావెల కిశోర్ బాబు ఎద్దేవా చేశారు.
అసెంబ్లీలో రోజా ప్రవర్తనపై మహిళా సమాజం సిగ్గుతో తలదించుకుందని అయినా మహిళా శాసనసభ్యురాలు అనే విషయం మరిచి మహిళా లోకం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నోటి దురుసుతనం – వెకిలి చేష్టలతో శాసనసభ నుంచి సస్పెండ్ అయినప్పటికీ రోజా తీరులో ఎలాంటి మార్పు రాలేదని మండిపడ్డారు. స్పీకర్ కు క్షమాపణ చెప్పినప్పటికీ పాత పద్దతిలోనే ఆమె వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.