మాట ఇస్తే మడప తిప్పకూడదు. ఒకసారి మాట ఇచ్చాక ఎంత కష్టమైనా నిలబెట్టుకోవాలి. రాజకీయాల్లో దీనిని తూచా తప్పకుండా పాటించారు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆ తర్వాత ఆయన బాటలోనే జగన్ నడిచారు. ఎంత కష్టం వచ్చిన ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చారు. కానీ అబద్దపు మాటలు, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోయారు.
అవసరమైతే విద్యుత్తు చార్జీలను 30 శాతం తగ్గిస్తామని ఎన్నికల ముందు ప్రచారంలో హామీ ఇచ్చిన చంద్రబాబు…ఆ మాటలను బుట్టదాఖలు చేస్తూ కరెంట్ ఛార్జీల పెంపుకు రంగం సిద్ధం చేశారు. దీపావళి కానుకగా ప్రజలపై రూ.6,072.86 కోట్ల భారం వేసింది. కరెంట్ ఛార్జీలను పెంచ వద్దని ప్రజలు చేసిన విజ్ఞప్తులను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.
వాస్తవానికి మాట ఇచ్చి తప్పడం చంద్రబాబుకు కొత్తేమి కాదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడూ ఇలాగే విద్యుత్ రంగాన్ని నాశనం చేశారు. అనవసర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కారణంగా డిస్కంలను అప్పుల పాలుచేశారు. 2015–16లో 76 యూనిట్లు విద్యుత్ వినియోగిస్తే రూ.140.10 బిల్లు వచ్చేది. అదే టీడీపీ హయాంలో 2018–19లో ఇదే వినియోగానికి వచ్చిన బిల్లు రూ.197.60 అంటే 41.04 శాతం పెరిగింది.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన 5 నెలలలోపే, వినియోగదారులపై ఎఫ్‌పీసీసీఏ ఛార్జీల భారం రూ.6,072.86 కోట్లు వేశారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాన్నికి అర్థం ఏమిటి బాబూ? ప్రజలపై చార్జీల భారం వేయాలనేదే మీ ఉద్దేశ్యం అని అక్కడే స్పష్టం అయ్యిందని ప్రజలు మండిపడుతున్నారు.గతంలోనూ ఇలాగే చార్జీలు పెంచి ఇదేం న్యాయమని అడిగిన ప్రజలను బషీర్ బాగ్‌లో గుర్రాలతో తొక్కించి, తుపాకీలతో కాల్పించి చంపించిన చంద్రబాబు…ఇప్పుడు అదే చరిత్రను తిరగరాసేందుకు రెడీ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
