సాధారణంగా పెంపుడు కుక్కలను విశ్వాసానికి ప్రతీకగా చెబుతుంటారు. పెంపుడు కుక్కలు తమ యజమానులకు ఎంతో విధేయంగా ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడటం చూస్తూ ఉంటాం. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో శునకాలను పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. కష్ట సమయంలో తమ యజమానులను శునకాలు కాపాడిన సంఘటనల గురించి తరచూ వింటుంటాం.
అయితే కొంత మంది శునకాలతో పాటు పిల్లులను కూడా పెంచుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడో పిల్లి కూడా యజమాని పట్ల స్వామి భక్తిని ప్రదర్శించింది. తమ యజమాని కుటుంబాన్ని పాము బారి నుంచి కాపాడింది. ఒడిశా రాష్ట్రంలోని భీమాతంగి ప్రాంతంలోని సంపద్ కుమార్ పరిదా కుటంబుం చిని అనే ఓ పిల్లిని పెంచుకుంటోంది.
అయితే తన పిల్లి ఒక్కసారిగా పెరట్లోకి వెళ్లడంతో .. యజమాని దాన్ని అనుసరించాడు. ఆ తర్వాత అక్కడ ఓ పెద్ద నాగుపాము ఆ వ్యక్తికి కనిపించింది. ఆ నాగుపాము ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. పిల్లి దాదాపు అరగంట సేపు దాన్ని నిలువరించింది. అనంతరం సంపద్ కుమార్ స్నేక్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయగా.. వారు వచ్చి నాగుపామును తీసుకెళ్లి.. అడవిలో వదిలేశారు.