పవన్‌..గట్టెక్కించేనా?

పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత అసలు సిసలైన పరీక్షను ఎదుర్కొబోతున్నారు పవన్. పార్టీ పెట్టి పది సంవత్సరాలు దాటుతున్న పవన్‌కు ఇలాంటి సమస్య ఎదురుకాలేదు. కానీ ఈసారి ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తుండటంతో పవన్‌ తలకు మించిన భారాన్ని తమ మీద పెట్టుకున్నారని చెప్పక తప్పదు.

ఎందుకంటే గత ఎన్నికల్లో అడిగిన వారికల్లా టికెట్ ఇచ్చారు పవన్. గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే తన వెంట ఉన్న వారికి న్యాయం చేస్తాననే ధీమా మాత్రం కల్పించారు. కానీ ఇప్పుడు టీడీపీతో పొత్తు ప్రకటన తర్వాత జనసేనలో టికెట్లు ఆశీంచే వారి సంఖ్య చాంతాడంత ఉండగా ఇందులో ఎంతమందికి టికెట్ దక్కుతుందనేది సమాధానం లేని ప్రశ్నే.

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలుండగా కనీసం 40 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది జనసేన. ఇందుకు సంబంధించి బలమైన అభ్యర్థులే ఉండగా పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు వస్తాయో ఒక్క పవన్‌కి తప్ప మరెవరికి తెలియని పరిస్థితి. ఇక జనసేన బలంగా ఉన్న జిల్లాల్లో మెజారిటీ సీట్లను ఆశీస్తున్నారు జనసేన నేతలు. అయితే టీడీపీ మాత్రం జనసేనకు పెద్ద మొత్తంలో టికెట్లు ఇచ్చేందుకు రెడీగా లేదు. ఇదే విషయాన్ని పవన్‌కి సైతం వెల్లడించారట.

అందుకే పవన్ సైతం ఇదే విషయాన్ని కేడర్‌కు చెబుతున్న పరిస్థితి. పదవులు ఆశించకుండా పనిచేయాలని…అలా చేసిన వారిని తాను కాపాడుకుంటానని వెల్లడిస్తున్నారట. దీంతో సీట్లు ఆశీంచి పనిచేసుకుంటూ వస్తున్న నాయకులు ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారని టాక్. ఇందులో పవన్‌ని నమ్మి పది సంవత్సరాలుగా జెండా మోసిన నాయకులు ఉన్నారు. మరి పవన్ ఒకవేళ హ్యాండ్ ఇస్తే వారు పవన్‌కు షాక్ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. అందుకే త్వరలోనే పవన్ నియోజకవర్గాల వారీగా పర్యటిస్తారని ప్రచారం జరుగుతున్న అసంతృప్తులను బుజ్జగించడం పవన్‌కు కష్టమైన పని అంతా అభిప్రాయపడుతున్నారు.