సీజన్ బట్టి కొన్ని రకాల పండ్లు దొరుకుతుంటాయి. ఇందులో ఒకటి కర్బూజ. రుచిలో కాస్త ఒగరు, తీపి కలగలిపి ఉండే కర్బూజ వేసవిలో ఎంతో మేలు చేస్తుంది. ఎండవేడిమి నుండి ఉపశమనం కలిగించడంలో తోడ్పాటునందిస్తుంది. ముఖ్యంగా కర్బూజలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వేసవిలో నీరు ఎక్కువగా ఉండే పండ్లను తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు కాబట్టి కర్బూజ గురించి తెలిసిన వారు అస్సలు వదలరు.
ఇందులో బీటాకెరోటిన్, విటమిన్ సి వంటివి ఉంటాయి.మనశరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి తెల్ల రక్త కణాల వృద్దిని పెంచుతాయి. కర్బూజలో ఉండే కెరోటిన్, లుటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్తం చేయడంలో సహాయపడతాయి. గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లతో సహా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఆరోగ్యకరమైన చర్మం కోసం రోగనిరోధక పనితీరు, కొల్లాజెన్ ఉత్పత్తికి సపోర్ట్ చేస్తుంది. కర్బూజా లో విటమిన్ కే, పొటాషియం, బీ విటమిన్లు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యం, ఎలక్ట్రోలైట్ సమతుల్యత, జీవక్రియకు సహాయపడతాయి. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను, సాధారణ పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.

