ఏపీ సార్వత్రిక ఎన్నికల సమరం కొన్ని చోట్ల రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. పోలింగ్ రోజు, ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో అల్లరి మూకలు దాడులకు పాల్పడ్డారు. ఇక ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం 13 మంది సభ్యులతో సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది.
రెండు రోజుల పాటు ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించిన సిట్ టీమ్ సభ్యులు ప్రాధమిక నివేదికను తయారు చేసినట్లు తెలుస్తోంది. ఆ నివేదికను ఇవాళ ఏపీ డీజీపీకి అందజేయనుండగా మరింత లోతుగా విచారణ కోసం మరికొన్ని రోజుల గడువు కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం. జరిగిన మొత్తం అల్లర్ల వ్యవహారంలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిందని సిట్ ప్రాధమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.
పల్లాడుతో పాటు మాచర్ల, గురజాడ, నర్సరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో పర్యటించారు సిట్ సభ్యులు. పోలింగ్ రోజు జరిగిన అల్లర్లు, పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. తిరుపతి పద్మావతి వర్సిటీలో జరిగిన దాడి ప్రాంతాన్ని సిట్ బృందం పరిశీలించింది. ఘర్షణకు సంబంధించి సీసీ పుటేజీలు, ఘటనా స్థలంలో దొరికిన ఆయుధాలు, అల్లర్లకు కారణమైన వారిని గుర్తింపు, వారిపై నమోదైన కేసులను సిట్ బృందాలు పరిశీలించాయి. మొత్తంగా పూర్తిస్థాయి నివేదికను అందించేందుకు మరికొంత సమయాన్ని కోరే అవకాశం ఉంది.