ఆమె మంత్రిగారి భార్య. అధికారం చేతిలో ఉంది..ఏదైనా చేయవచ్చు అనుకుందేమో కానీ ఆమె చేసిన పని ఇప్పుడు సొంత పార్టీ నేతల నుండే కాదు సామాన్యుల దగ్గరి నుండి విమర్శలు ఎదుర్కొవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి నెలరోజులు కూడా కాలేదు. అప్పుడే అధికారం ఉందని ఇష్టమున్నట్లు వ్యవహరిస్తున్నారు ఆ పార్టీ నేతలు. లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకుని దాడులకు తెగబడుతుండగా ఇప్పుడు ఏకంగా ఓ మంత్రి భార్య పోలీసులపై రెచ్చిపోయారు. కానీ సీన్ కట్ చేస్తే అందరి ముందు నవ్వుల పాలయ్యారు.
ఏపీ రవాణశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితా రెడ్డి పోలీసులతో వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. తెల్లారిందా? మీ కోసం మేం ఎదురుచూడాలా? మీకు జీతాలు ప్రభుత్వమే కదా చెల్లిస్తోంది. వైసీపీ వాళ్లు ఏమైనా ఇస్తున్నారా? అంటూ నోరు పారేసుకున్నారు. అంతేగాదు మీ కోసం అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం. వెంటనే వెళ్లి కాన్వాయ్ స్టార్ట్ చేయండి అని ఆమె పోలీసులపై అసహనం వ్యక్తం చేయగా ఇది వైరల్గా మారింది.
టీడీపీ నేతల తీరుపై విమర్శలు వస్తుండటంతో రియాక్ట్ అయ్యారు సీఎం చంద్రబాబు. పోలీసులతో మంత్రి భార్య హరితా రెడ్డి వ్యవహరించిన తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వివరణ కోరడమే కాదు అధికారులు, ఉద్యోగుల పట్ల గౌరవంగా మసలుకోవాలని సూచించారని తెలుస్తోంది. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడమే కాదు నెటిజన్లు తూర్పారబట్టారు. మంత్రి గారి భార్య రాయచోటిలో పోలీసులను బానిసల్లా చూస్తూ వార్నింగ్ ఇస్తున్నారు..ఇదేనా పాలన అంటే అని చురకలు అంటించారు. డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారితో మాట్లాడేది ఇలానేనా? అని మరికొంతమంది కామెంట్స్ చేశారు.