ఎడతెరపిలేని వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. హైదరాబాద్, ఖమ్మంలకు వర్షం పోటెత్తగా విజయవాడ జలదిగ్బందం అయింది. ఇక వరద బాధితుల సహాయక చర్యలు కొనసాగుతుండగా పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు తమ వంతు సాయం అందిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయన్నారు మెగాస్టార్ చిరంజీవి. తన వంతుగా తెలంగాణ, ఏపీకి చెరో రూ.50 లక్షలు విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థించారు.
అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఏకంగా రూ. 2 కోట్ల విరాళాన్ని అందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేస్తున్నట్లు తెలిపారు ప్రభాస్. ఇక ఇప్పటివరకు విరాళాలు ఇచ్చిన హీరోల వివరాలను చూస్తే…పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు,జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు 50 లక్షల చొప్పున ప్రకటించారు.
కల్కి నిర్మాతలు ,వైజయంతి మూవీస్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు 25 లక్షలు, మహేష్ బాబు రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు 50 లక్షల చొప్పున కోటి రూపాయలు ప్రకటించగా బాలకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి 50 లక్షల చొప్పున ,ఆయ్ మూవీ యూనిట్ ..ఈ వారం అంతా వచ్చే కలెక్షన్స్ లో 25 శాతం ఏపీ రిలీఫ్ ఫండ్ కు ,త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ కలిసి రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి 25 లక్షల చొప్పున ప్రకటించారు.
సిద్ధూ జొన్నలగడ్డ రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి 15 లక్షల చొప్పున ,విశ్వక్ సేన్ ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్ కి 5 లక్షల చొప్పున ప్రకటించారు. దర్శకుడు వెంకీ అట్లూరి రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి 5 లక్షల చొప్పున,అనన్య నాగళ్ళ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి 2.5 లక్షల చొప్పున ప్రకటించింది.