యూరియా బుకింగ్ యాప్ పేరుతో రైతుల ఫోన్లకు ఏపీకే (APK) ఫైల్స్ వస్తుండటంతో రైతన్నలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే సైబర్ నేరగాళ్ల మోసాలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, ఇలాంటి అనధికారిక ఫైల్స్‌ను ఇన్స్టాల్ చేస్తే తమ బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయేమోనని రైతులు భయపడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా బుకింగ్ యాప్ రైతులకు భరోసా ఇవ్వాల్సిన బదులు భయాన్ని పెంచుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్లే స్టోర్‌లో “Fertilizer Booking App” పేరుతో యాప్ అందుబాటులో ఉన్నప్పటికీ, వాట్సాప్ గ్రూపుల ద్వారా ఏపీకే ఫైల్స్ పంపిస్తూ వాటినే ఇన్స్టాల్ చేసుకోవాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఇది అనుమానాలకు తావిస్తోంది.
సూర్యాపేట జిల్లాలో ఈ ఏపీకే ఫైల్స్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యూరియా కోసం తప్పనిసరిగా ఈ ఫైల్స్‌ను ఇన్స్టాల్ చేయాలంటూ చెప్పడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసే సమయంలో ఫోన్లో “Unknown App – Risk” అంటూ హెచ్చరికలు రావడంతో మరింత భయం పెరుగుతోంది. అయినప్పటికీ రిస్క్ ఆప్షన్‌ను ఓకే చేసి ఇన్స్టాల్ చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పటికే సైబర్ మోసాలు రైతులను వెంటాడుతున్న సమయంలో, ఇలాంటి అనధికారిక ఫైల్స్ ద్వారా ఫోన్లోని వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా సరఫరా కోసం రైతులను ఇలాంటి రిస్క్ పరిస్థితుల్లోకి నెట్టడం సరికాదని, ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని, అధికారిక యాప్ ద్వారానే సేవలు అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
