హైదరాబాద్ నార్సింగీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. గంజాయి మత్తులో ఓ మైనర్ బాలికపై ముగ్గురు రౌడీషీటర్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.
పరిచయమున్న ఓ యువకుడిని కలిసేందుకు బాలిక చార్మినార్ ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం. అక్కడ నుంచి మాయమాటలు చెప్పి ఆమెను చెంగిచెర్లకు తీసుకెళ్లిన నిందితుడు, మరో ఇద్దరితో కలిసి బాలికకు గంజాయి ఇచ్చి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.
బాలిక స్కూలుకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన అమ్మమ్మ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో నిందితుల లొకేషన్‌ను గుర్తించి ముగ్గురినీ అరెస్ట్ చేశారు.
అరెస్ట్ అయిన వారిలో ఒకరిపై ఇప్పటికే హత్య కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులపై పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులకు కఠిన శిక్షలు విధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
