మధ్యప్రదేశ్‌లోని ఆలీరాజ్పుర్ జిల్లాలో అమానుష ఘటన వెలుగుచూసింది. ఇంట్లోకి చొరబడిన దోపిడీ దొంగలు, 40 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, దిల్లీ నిర్భయ ఘటనను తలపించేలా మర్మాంగంలో కర్రను చొప్పించి చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
శుక్రవారం రాత్రి బోరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లోకి దోపిడీ దొంగలు చొరబడ్డారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న 40 ఏళ్ల మహిళపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా, అత్యంత పాశవికంగా ఆమె మర్మాంగంలో కర్రను చొప్పించి గాయపరిచారు. నిందితులు బాధితురాలి ఇంట్లో ఉన్న వెండి ఆభరణాలు, మొబైల్ ఫోన్‌ను దోచుకుని అక్కడి నుండి పరారయ్యారు.
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బాధితురాలిని వెంటనే చికిత్స నిమిత్తం ఇందౌర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆలీరాజ్పుర్ ఎస్పీ రఘువంశ్కుమార్ ఈ ఘటనను ధృవీకరిస్తూ, ఇప్పటికే ఘటనా స్థలం నుండి కీలక ఆధారాలను సేకరించామని తెలిపారు. దోపిడీ కోసమే నిందితులు ఇంట్లోకి ప్రవేశించినట్లు ప్రాథమికంగా గుర్తించామని, పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.
ఈ అమానుష ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను తక్షణమే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమై ఉన్నారు.
