రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురిని పొట్టనబెట్టుకున్న ప్రేమోన్మాది రాజ్‌కుమార్‌ను ఎన్కౌంటర్ చేయాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ డిమాండ్ చేశారు. ఆదివారం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందించిన ఆయన.. పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాలిక కుటుంబంతో పాటు తన భార్యాపిల్లలను దారుణంగా హతమార్చిన నిందితుడు సమాజంలో తిరగడానికి అనర్హుడని, అతడిని ఎన్కౌంటర్ చేసి పారేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసినా నిందితుడిని అరెస్టు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం వహించారని, అందుకే ఈ మారణహోమం జరిగిందని మండిపడ్డారు. కేవలం ఎస్సై, సిఐని సస్పెండ్ చేస్తే సరిపోదని, బాధ్యులైన పోలీసు ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నిందితుడికి అండగా ఉండి కేసులు రాకుండా కాపాడిన అతడి సోదరుడు భాస్కర్‌ను, తండ్రిని కూడా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, ఆరుగురిని హత్య చేసిన నిందితుడు రాజ్‌కుమార్ ఆచూకీ కోసం ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆధ్వర్యంలో 10 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద నిందితుడి కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పెంజర్ల, నందిగామ ప్రాంతాల్లో సంచరించినట్లు సమాచారం అందినప్పటికీ, పోలీసులు వెళ్లేసరికి అతను తప్పించుకుంటున్నాడు. అతను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
నిందితుడు రాజ్‌కుమార్ ఇంటర్లో ఉన్నప్పుడు తనకంటే వయసులో పెద్దదైన సరితను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత రెండేళ్లు డ్రైవర్‌గా పనిచేసి, ఆ తర్వాత మద్యం, జూదానికి అలవాటై రూ. 2.5 కోట్ల అప్పులు చేశాడు. అప్పుల బాధతో గతేడాది ఆత్మహత్యాయత్నం చేసినట్లు అతడి తండ్రి అరుణ్‌కుమార్ తెలిపారు. అప్పుల ఒత్తిడి, తనపై నమోదైన పోక్సో కేసులో నిందితురాలిగా ఉన్న బాలికపై కక్షతోనే అతను ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
బాధితురాలి కుటుంబంలో అనాథగా మిగిలిన వికలాంగురాలికి నిరంతరం అండగా ఉంటానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం చట్టాలను కఠినతరం చేయాలని, వ్యవస్థలు సక్రమంగా పనిచేసేలా చూడాలని ఆయన కోరారు.
