- Advertisement -

తమిళ హీరో ఆర్యపై జూబ్లీహిల్స్‌లో చీటింగ్ కేసు

- Advertisement -

హైదరాబాద్‌కు చెందిన ఒక సినీ టెక్నిక్ సంస్థను మోసం చేశారనే ఆరోపణలతో ప్రముఖ తమిళ హీరో ఆర్య (జంషాద్ సి)పై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. ‘అనంతన్ కాడు’ అనే మలయాళ చిత్ర షూటింగ్ నిమిత్తం అద్దెకు తీసుకున్న కెమెరాలు, లైటింగ్ పరికరాలకు సంబంధించిన రూ. 1.80 కోట్లకు పైగా బకాయిలు చెల్లించకుండా ఎగవేసినందుకు ఈ కేసు నమోదు చేశారు.

జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరి, హైలాంకాలనీలో ఉన్న ‘తాహెర్ సినీ టెక్నిక్’ సంస్థకు చెందిన అకౌంటెంట్ జావేద్ అలీ ఈ ఫిర్యాదు చేశారు. 2025 ఫిబ్రవరిలో నటుడు ఆర్య, నిర్మాత వినోద్ తమ చిత్రీకరణ కోసం అత్యాధునిక డిజిటల్ కెమెరాలు, లైటింగ్ యూనిట్లను అద్దెకు తీసుకోవాలని కోరారు. రూ. 2.12 కోట్ల అద్దె ఒప్పందంపై సంతకాలు జరిగాయి. తాహెర్ సినీ టెక్నిక్ సంస్థ తన సొంత ఖర్చులతో ఈ పరికరాలను హైదరాబాద్ నుండి కేరళలోని షూటింగ్ లొకేషన్లకు తరలించింది.

షూటింగ్ పూర్తయిన తర్వాత, చెల్లించాల్సిన మొత్తం రూ. 2.12 కోట్లలో కేవలం స్వల్ప మొత్తాన్ని మాత్రమే చెల్లించి, దాదాపు రూ. 1.80 కోట్లకు పైగా బకాయిలను చిత్రబృందం ఎగవేసింది. సినిమా విడుదల కంటే ముందే బకాయిలు చెల్లించి ‘నో డ్యూస్ సర్టిఫికేట్’ తీసుకుంటామని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసినప్పటికీ, వారు మాట నిలబెట్టుకోలేదు.

బకాయిల కోసం పలుమార్లు ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాల ద్వారా సంప్రదించినా చిత్రబృందం స్పందించలేదు. పైగా, తమ డబ్బుల గురించి అడిగిన సంస్థ మేనేజర్‌ను హీరో ఆర్య, నిర్మాత వినోద్, ఆర్య వ్యక్తిగత సహాయకుడు కిశోర్ కలిసి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వాస్తవాలను కప్పిపుచ్చి కేరళలోని స్థానిక న్యాయస్థానం నుండి వీరు మధ్యంతర ఉత్తర్వులు కూడా పొందారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు ఆర్య, నిర్మాత వినోద్, పీఏ కిశోర్‌లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఆర్థిక వివాదంపై దర్యాప్తు వేగవంతం చేశామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని శనివారం పోలీసులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -