వివాహంతో సమానమైన ‘లైవ్-ఇన్’ (Live-in) సంబంధాల్లో ఉన్న మహిళలను IPC సెక్షన్ 498A (గృహ హింస, వేధింపులు) రక్షణ పరిధి నుంచి మినహాయించడం రాజ్యాంగ విరుద్ధమని అది వివక్ష చూపడమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వివాహంతో సమానమైన సంబంధంలో ఉన్న పురుషుడు మహిళను వేధింపులకు గురిచేస్తే, ఆయన్ను భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 498A (IPC) కింద ప్రాసిక్యూట్ చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
అయితే వివాహం చేసుకోవాలనే ఆలోచన/ఉద్దేశం ఉండి వివాహ స్వభావం కలిగిన లైవ్-ఇన్ సంబంధాలకు మాత్రమే ఈ తీర్పు వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.
న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ నోంగ్మైకాపం కోటీశ్వర్ సింగ్ లతో కూడిన ధర్మాసనం ఈ సంచలన తీర్పును వెలువరించింది. గృహ హింస నుంచి రక్షణ కల్పించే విషయంలో చట్టబద్ధంగా పెళ్లైన మహిళకు వివాహంతో సమానమైన సంబంధంలో ఉన్న మహిళకు వ్యత్యాసం చూపడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు)కు భంగం కలిగించడమేనని కోర్టు పేర్కొంది.
భర్త లేదా అత్తమామల వేధింపుల నుంచి, శారీరక-మానసిక హింస నుంచి లేదా ఆత్మహత్యకు ప్రేరేపించే పరిస్థితుల నుంచి మహిళలకు రక్షణ కల్పించడమే సెక్షన్ 498A యొక్క ముఖ్య ఉద్దేశం. అటువంటి వేధింపులు కేవలం అధికారికంగా పెళ్లైన తర్వాతే జరుగుతాయి, అంతకుముందు జరగవని అనడం సరైనది కాదు. చట్టబద్ధంగా వివాహమైన వారికి, వివాహ స్వభావం కలిగిన లైవ్-ఇన్ బంధంలో ఉన్నవారికి మధ్య తేడా చూపడం గృహహింస నిరోధక లక్ష్యానికి విరుద్ధం” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
తనపై నమోదైన 498A కేసును కొట్టివేయాలని కోరుతూ పిటిషనర్ దాఖలు చేసిన అప్పీలును కర్ణాటక హైకోర్టు తిరస్కరించగా, ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. సెక్షన్ 498A లోని ‘భర్త’ అనే పదానికి విస్తృతమైన అర్థాన్ని ఇస్తూ పెళ్లి చేసుకొనే ఉద్దేశంతో వివాహ బంధం లాంటి లైవ్-ఇన్ సంబంధంలో ఉన్న పురుషుడు కూడా ఈ పదం పరిధిలోకి వస్తాడని స్పష్టం చేసింది.
